ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి నడుస్తోంది. పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. ఇప్పటికే ఒక దశ పోలింగ్ పూర్తి కాగా.. మరో 3 రోజుల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పార్టీలు, అభ్యర్థులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై ఎన్నికల సంఘం కొరఢా ఝళిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఏకంగా 17400 ఫిర్యాదులు వచ్చాయి.
రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు గుప్పించిన మోదీ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ‘చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ప్రధాని నరేంద్ర మోదీపై కఠిన చర్యలు తీసుకోవాలని 17400 మంది పౌరులు భారత ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాశారు.
వతన్ కే రహామే, సంవిధాన్ బచావో నాగరిక్ అభియాన్ అనే 2 పౌర హక్కుల సంఘాలు చేసిన ఫిర్యాదుపై 17400 మంది పౌరుల సంతకాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం మత భావాలను ఆకర్షించడమే కాకుండా ముస్లింలపై హిందువుల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని వారు ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే మన మహిళల బంగారం.. చివరకు మంగళసూత్రాలను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తోందని ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ దేశంలోని సంపదపై తొలిహక్కు ముస్లింలకే ఉంది అని గతంలో యూపీఏ అధికారంలో ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు చేశారని మోదీ ప్రస్తావించారు.
ఇటీవల బన్స్వారాలో మాట్లాడిన ప్రధాని మోదీ.. దేశ ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు అక్రమ వలసదారులకు, చొరబాటుదారులకు ఇవ్వాలా అంటూ ఆ సభలో పాల్గొన్న వారిని ప్రశ్నించారు. అర్బన్ నక్సల్స్ భావజాలం మహిళల మంగళసూత్రాలను కూడా తీసేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే ప్రసంగంపై మంగళవారం గుర్తు చేసిన ప్రధాని మోదీ.. తాను మాట్లాడిన 90 సెకన్ల ప్రసంగం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా భయపెడుతోందని.. నిజం చెప్పడంతో హస్తం పార్టీ భయాందోళనలో ఉందని తెలిపారు.