ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లా చదివి తన కేసును తనే వాదించుకున్న వ్యక్తి.. హత్య కేసులో ఇరుక్కుని 12 ఏళ్ల పోరాటం.. చివరికి!

national |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2023, 09:37 PM

మన దేశంలో న్యాయవ్యవస్థపై చాలా నమ్మకం ఉంటుంది. అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయవ్యవస్థనే నిర్దోషులుగా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. న్యాయం ఆలస్యమైనా చివరికి గెలుస్తుందని నిరూపించిన సంఘటనలు కోకొల్లలు. అదే విధంగా ఉత్తర్‌ప్రదే‌శ్‌లో 12 ఏళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో ఇరుక్కున్న ఓ వ్యక్తి.. లా చదివి ఆ కేసును వాదించి విజయం సాధించాడు. చివరికి ఆ అక్రమ కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. దీంతో 12 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.


2011 లో ఉత్తర్‌ప్రదేశ్‌ మీరట్‌లో ఇద్దరు కానిస్టేబుల్‌లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో అమిత్ చౌదరీ అనే 18 ఏళ్ల వ్యక్తిని నిందితుల్లో ఒకరిగా పోలీసులు గుర్తించారు. పోలీస్ సిబ్బంది హత్యకు గురి కావడంతో ఆ ఘటన యూపీ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపడంతో అప్పటి సీఎం మాయావతి తీవ్రంగా స్పందించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కేసులో మొత్తం 17 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అందులో 18 ఏళ్ల అమిత్ చౌదరీ కూడా ఉన్నాడు. వారిపై ఐపీసీతోపాటు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కఠినమైన అభియోగాలు మోపారు.


అయితే ఈ ఇద్దరు కానిస్టేబుల్‌ల హత్య వెనుక కైల్ అనే క్రిమినల్ ముఠా హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ ముఠాలోనే అమిత్ చౌదరి భాగమని గుర్తించిన పోలీసులు అతడిని జైలుకు తరలించారు. 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అమిత్ చౌదరీ.. ఈ కేసులో తాను నిర్దోషిని అని మొర పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే లా విద్యను చదవాలని నిర్ణయించుకున్నాడు. బాగ్‌పత్‌లోని కిర్తల్ గ్రామానికి చెందిన ఒక రైతు కుమారుడైన అమిత్ చౌదరీ.. జైలు జీవితాన్ని అనుభవించినా.. తన పట్టుదలను మార్చుకోలేదు. ముజఫర్‌నగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌లు అనిల్ దుజానా, విక్కీ త్యాగి తనను వారి గ్యాంగ్‌లలో చేర్చుకోవడానికి ప్రయత్నించారని అమిత్ చౌదరీ పేర్కొన్నాడు. అయితే ఆ జైలులో ఉన్న జైలర్.. తనను గ్యాంగ్‌స్టర్‌లు లేని బ్యారక్‌లో ఉంచినట్లు తెలిపాడు. ఇక 2 ఏళ్ల జైలు శిక్ష తర్వాత 2013 లో బెయిల్‌పై విడుదలైన అమిత్ చౌదరి.. ఈ కేసులో తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాడు.


ఈ క్రమంలోనే బీఏ ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్‌ఎమ్ సహా పలు లా కోర్సులను చేశాడు. చివరికి బార్ కౌన్సిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి న్యాయవాద పట్టాను అందుకున్నాడు. ఈ క్రమంలోనే తన కేసును తానే వాదించుకున్నాడు. అయితే ఆ ఇద్దరు కానిస్టేబుల్‌లను చంపిన కేసు ఎలాంటి సాక్షులు, వాంగ్మూలాలు లేకుండా నత్త నడకన సాగింది. ఈ క్రమంలోనే న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో చేరడానికి అన్ని అకడమిక్ అర్హతలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ కేసు కోర్టు విచారణ జరపగా.. అమిత్ చౌదరీ నిందితుల తరఫున వాదించారు. ఈ క్రమంలోనే అమిత్ చౌదరీ సహా 13 మంది వ్యక్తులను ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది.


కానిస్టేబుళ్లు క్రిషన్‌పాల్, అమిత్ కుమార్‌లను హత్య చేయడానికి, వారి వద్ద ఉన్న తుపాకులను ఎత్తుకెళ్లేందుకు నిందితులు కుట్ర చేశారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో వారిని నిర్దోషులుగా కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ జంట హత్యల్లో అసలైన నిందితులైన సుమిత్ కైల్, నీతూ, ధర్మేంద్రలను దోషులుగా గుర్తించారు. అయితే 2013 లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుమిత్ కైల్ హత్యకు గురయ్యాడు. కానిస్టేబుల్‌లను చంపి వారి తుపాకీలను తీసుకున్నందుకు నీతుకు జీవిత ఖైదుతోపాటు రూ. 20 వేల జరిమానా కోర్టు విధించింది. తీర్పుకు ముందే ధర్మేంద్ర క్యాన్సర్‌తో మరణించాడు. అయితే భారత సైన్యంలో చేరాలనేది తన కల అని అమిత్ చౌదరీ పేర్కొన్నాడు. అయితే దానికి సిద్ధం అవుతుండగానే.. 2011 లో తన జీవితమే మారిపోయిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ కేసు కారణంగా తాను లా కోర్సు చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం క్రిమినల్ జస్టిస్‌లో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నట్లు వివరించాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com