ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్ 10న ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 12:12 AM

మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కోసం ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర, రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందంపై అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10న ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ నిర్వహించుకుంటున్నాం. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతే మానవ హక్కుల దినోత్సవం జరపాలన్న ప్రకటన వచ్చింది. శాంతి నెలకొల్పాలన్న ఆకాంక్ష కూడా ఈ ప్రకటనలో ఇమిడి ఉంది. ప్రపంచ యుద్ధం తర్వాత అనేక సోషలిస్టు ప్రజాస్వామ్య దేశాల ఆవిష్కరణ జరిగింది. అయినా వివిధ దేశాల లోపల బయట కూడా మానవ హక్కుల 'హననం' జరుగుతూనే ఉంది.


శాస్త్ర, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలు తమ ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురాగతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు 1948 డిసెంబరు 10న ఐక్యరాజ్యసమితి సార్వజనీన మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. భారత స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్‌ హన్స్‌ జీవరాజ్‌ మెహతాతో పాటు వివిధ దేశాలు, సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి ఈ ప్రకటనను రూపొందించారు.


అప్పటి నుంచి ఏటా డిసెంబరు 10 ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా ఓ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని మానవహక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘అందరికీ గౌరవం, స్వేచ్ఛ, న్యాయం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోనున్నారు.


ఐరాస మానవ హక్కుల ప్రకటన భారత్‌ సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తోంది. ఐరాసలోని సభ్యదేశాల పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు; అంతర్జాతీయ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడింది. ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’పై అన్ని సభ్య దేశాలను, సంస్థలను ఆహ్వానించి సాధారణ సభ 423 (ఐ) తీర్మానానికి ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి అన్ని దేశాలూ డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం పాటించడం ఆనవాయితీగా వస్తోంది. 1993లో మానవ హక్కుల అభివృద్ధి, పరిరక్షణ కోసం ఒక హైకమిషనర్‌ను ఐరాస నియమించింది.


మానవ హక్కులు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు సంబంధించిన అంశమే మాత్రమే కాదు.. సార్వత్రిక, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులు ముఖ్యంగా ఐరాస, లాటిన్ అమెరికాల సహకారంతో ప్రారంభమైంది. ప్రభుత్వాలు, పాలకులు నిరంకుశ ధోరణితో ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి.


భారత్‌లో మానవహక్కుల పరిరక్షణ చట్టం


భారత్‌లో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993లో ఆమోదించారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1993 అక్టోబర్ 12న మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినా రాజ్యాంగబద్ధతలేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సక్రమంగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుడి జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది.


భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులు ఉంటాయి. కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కూడా చూడటం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరిస్తోంది. పరువుహత్య, జాతి వివక్ష హత్య, అత్యాచార ఘటనలు.. ఇలా అనేకరకాల వార్తలు రోజూ మనం చూస్తునే ఉన్నారు. కొంతమంది ఇంకా జాతి, భాష, కులమతాల జాఢ్యాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘసంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పిచేందుకు 1948 డిసెంబర్‌ 10న ఐక్యరాజ్యసమితి ‘విశ్వమానవ హక్కుల ప్రకటన’ చేసింది.


సమాజంలోని కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోంది. ఈ ఆధిపత్య వాదమే- బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషాపరమైన అమానుషాలకు కారణమవుతోంది. 1857లో 'డ్రెడ్‌ స్కాట్‌ వర్సెస్‌ శాండ్‌ ఫోర్డ్‌' కేసులో అమెరికా సుప్రీంకోర్టు అక్కడి నల్లజాతీయులు దేశ పౌరులు కారని తీర్పు చెప్పిందంటే.. వారి నరానరాన జాత్యహంకారం ఎంతగా జీర్ణించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.


తరవాత 1886లో అదే కోర్టు అమెరికా కంపెనీలకు దేశ పౌరసత్వం కల్పించింది. అమెరికాలో నల్లజాతీయుల కంటే ముందుగా కంపెనీలకు పౌరసత్వ హక్కులు లభించడం గమనార్హం. మనుషులకన్నా కంపెనీలే అధికమంటున్న ఆ తీర్పు కంటే దారుణం మరొకటి ఉండదు. ఇటువంటి దురాగతాలను నివారించడానికి ఐరాస మానవ హక్కుల ప్రకటన మనుషులంతా సమానులేనని ఉద్ఘాటించింది. మానవ హక్కులు ప్రాథమిక హక్కులే. వాటిని ఎవరూ హరించలేరు. ప్రజాప్రయోజనాల కోసం ఎంతో అవసరమైతే తప్ప ప్రభుత్వాలూ వాటిని సస్పెండ్‌ చేయలేవు. ఈ ప్రకటన ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్ష లేకుండా ప్రశాంతంగా జీవించాలి. జాతి, మత, రాజకీయ, వ్యక్తిగత కారణాలతో ప్రజలు ఇబ్బందులకు గురి కారాదు.


మానవహక్కుల ప్రధాన లక్ష్యాలు...


1. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం.


2. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడటం.


3. వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ.


4. నిర్బంధం లేని జీవన విధానం.


5. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు.


6. సురక్షిత ప్రాంతాలలో జీవించే హక్కు.


7. బలవంతపు పనుల నుంచి విముక్తి.


8. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ.


9. భావప్రకటన, స్వాతంత్య్రపు హక్కు.


10. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు.


ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి ఇబ్బందులకు గురి చేసినపుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడుతాయి.SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com