ఈరోజుల్లో సినిమా విడుదలవుతుందంటే, ఆయా చిత్రబృందాలు ప్రమోషన్స్ తో ఠారెత్తిస్తున్నారు. తమ సినిమా పట్ల ప్రేక్షకుల్లో తగిన బజ్ క్రియేట్ చేసేందుకు నిర్మాతలు ఏమాత్రం తగ్గకుండా ఖర్చు పెడుతున్నారు. ఉదాహరణకు విరాటపర్వం సినిమానే తీసుకోండి. గతేడాదిలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 17న విడుదలవడానికి సిద్దమవుతుంది. మొన్నటివరకు అసలు ఈ సినిమా విడుదలవుతుందా లేదా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు వరస ప్రమోషన్స్ చేస్తూ, సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజుని తీసుకొచ్చారు. కానీ ఒక సినిమా మాత్రం, ఇంకా రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్నా నిమ్మకునీరెత్తనట్టు సైలెంట్ గా ఉంది. అప్పుడెప్పుడో టీజర్ ను, మొన్నీమధ్య ట్రైలర్ ను రిలీజ్ చేసిన చిత్రబృందం మళ్ళీ కామ్ అయిపోయింది. పోనీ, సినిమా ఏమన్నా అప్ కమింగ్ హీరోదా అంటే అదీ కాదు... ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉన్న సత్యదేవ్ ది. ఆయన కొత్తగా నటించిన గాడ్సే మూవీ గురించే ఇప్పుడు చెప్పిన విషయమంతా. టీజర్ తో, ట్రైలర్ తో మంచి కంటెంట్ ఉన్న సినిమాగా, తప్పకుండా చూడాల్సిన సినిమా అని కొంతమంది ప్రేక్షకులను ఫీల్ తెప్పించింది. కానీ, పూర్తి సినిమాను ప్రతి ప్రేక్షకుడికి దగ్గర చెయ్యటంలో మూవీ టీం మొత్తం పూర్తిగా విఫలమైంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో గాడ్సే మూవీ చతికిలబడింది. పేలవమైన ప్రమోషన్ల కారణంగా, సినిమాకు సరైన బజ్ లేకపోవడంతో పేలవమైన బుకింగ్లు నమోదయ్యాయి. సరసమైన ధరలు ఉన్నప్పటికీ, ముందస్తు విక్రయాలు చాలా తక్కువగా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగబాబు కొణిదెల, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, నోయల్ సీన్, ప్రియదర్శి, నాజర్, సిజ్జు మీనన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ మరియు శాండీ అద్దంకి సంగీతం అందించారు.