ఫ్రీ ఆఫర్ అంటే చాలు... ఆకాశంలో అప్పడాలు, మేఘాల మీద మామిడి ముక్కలూ ఆరేసుకోవడానికి మన మధ్యతరగతి మనస్తత్వం ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. కిలో పప్పు పావలా తక్కువ రేటుకి దొరుకుతోంది అంటే... పాతిక కిలోమీటర్లు వెళ్లిపోవడానికి సైతం రెడీ అంటుంటారు. సైకిల్ కొంటే హెల్మెట్ ఫ్రీ అంటే... సైకిల్ తొక్కేవాడికి హెల్మెట్ ఎందుకు అంటూ లాజిక్కులు తీయరు. పడుంటుందని కొని పారేస్తారు. పావలా ఆదా అవుతుంది కానీ పెట్రోలు బిల్లు నూట పాతిక అవుతుందన్న సంగతి వేరే విషయం. అదే అన్లిమిటెడ్ ఆఫర్ అన్నారనుకోండీ. ఎగిరి గంతేస్తారు. అవసరం ఉన్నా, లేకున్నా లటుక్కున వాలిపోతారు. ఇక్కడ హీరోయిన్లూ అలాంటి ఆఫరే ఇస్తున్నారు. ‘మా అందం అన్ లిమిటెడ్’ అంటూ. నిజానికి హీరోయిన్లు ఎప్పుడో ఆ ఆఫర్ ఇచ్చేశారు. కానీ మనోళ్లు పెద్దగా దృష్టి పెట్టడం లేదంతే. ‘మమ్మల్ని ఈ సినిమాలో ఇంతే వాడుకోండి..’ అని ఎప్పుడూ కండీషన్లు పెట్టరు. ‘మేం ఇంతకంటే ఎక్కువ అందంగా కనిపించం..’ అంటూ గిరి గీసుకొని కూర్చోరు. మైనపు ముద్దగా మారిపోయిన ఆ గ్లామర్‌ని ముచ్చటగా మలుచుకొనే నేర్పు దర్శకుడికి తెలిస్తే చాలు. ఆ కిటుకు తెలిస్తే.. ప్రతీ సినిమా ఇలా కలర్‌ఫుల్లుగా ముస్తాబవుతుంది. ప్రతీ ఫ్రేమూ ఇలా గ్లామర్ ఒలికిస్తుంటుంది. అన్‌లిమిటెడ్‌గా.