బీజేపీలో చేరితే కోటి రూపాయలు ఇస్తమని చెబుతూ తనకు రూ. 10 లక్షలు ఇచ్చారని పీఏఏఎస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) కన్వీనర్ వరుణ్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. పటీదార్ సంఘం నేత హార్దిక్ పటేల్ కు దగ్గరి అనుచరుడైన వరుణ్ పటేల్ శనివారం నాడు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై 24 గంటలు గడవకుండానే, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మరో పటేల్ వర్గం నేత నరేంద్ర పటేల్, బీజేపీపై నిప్పులు చెరుగుతూ విమర్శలు చేశారు. తనకు రూ. కోటి ఇచ్చేందుకు బీజేపీ నేతలు బేరం కుదుర్చుకున్నారని, రూ. 10 లక్షలు ఇచ్చారని, ఆ డబ్బులు ఇవేనని చెబుతూ డబ్బులు చూపారు. రిజర్వ్ బ్యాంకును తన పేరిట రాసినా పటీదార్ అనామత్ ఆందోళన్ సమితికి అన్యాయం చేయబోనని తేల్చి చెప్పారు. కాగా, నరేంద్ర పటేల్ ఆరోపణలను వరుణ్ ఖండించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై ఈ ఆరోపణలు చేస్తున్నారని, డబ్బు బీజేపీదేనని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయా? అని అడిగారు. కాగా, నరేంద్ర ఆరోపణలపై బీజేపీ అధికారికంగా ఇంకా స్పందించలేదు.