కర్నూలు జిల్లాలోని ఆస్పరి ఎస్సై కొట్టారని ఏఐవైఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మేమేం పాపం చేశాం. గొడ్డును బాదినట్లు బాదారు. పిర్రలు కమిలిపోయేటట్టు కొట్టారు. మేమైనా దేశద్రోహం చేశామా. లేదంటే దోపిడీకి పాల్పడ్డామా. అంటూ ఏఐవైఎఫ్ మండల నాయకులు రాజశేఖర్, రమేష్ అన్నారు.
బుధవారం వీరిని పరామర్శించడానికి వచ్చిన సీపీఐ జిల్లా నాయకులు గిడ్డయ్య, బసాపురం గోపాల్, నాగేంద్రయ్య, సుదర్శన్ ఎదుట ఆస్పరి పోలీసుల తీరును వివరిస్తూ భోరున విలపించారు.
ఈనెల 12న శనివారం అర్ధరాత్రి ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికి చెందిన సీపీఐ మండల కన్వీనర్ విరుపాక్షిని అరెస్టు చేసేందుకు వచ్చిన ఎస్‌ఐ మునిప్రతాప్, పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు. తప్పు చేయకపోయినా అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించడంతో పోలీసులు వెనుదిరిగారు.
ఆ సమయంలో విరుపాక్షికి ఏఐవైఎఫ్ నాయకులు రాజశేఖర్, రమేష్ కూడా అండగా నిలిచారు. దీంతో ఎస్‌ఐ మునిప్రతాప్ తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 13వ తేదీ రాత్రి 11, 12 గంటల మధ్య పత్తికొండలో ఉన్న విరూపాక్షి, రాజశేఖర్, రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి ఆస్పరికి తీసుకువచ్చి విరుపాక్షిని గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజశేఖర్, రమేష్‌ను హాలహర్వి స్టేషన్‌కు తీసుకెళ్లారు. 14 తెల్లవారుజామున 4, 5 గంటల ప్రాంతంలో ఆస్పరి ఎస్‌ఐ మునిప్రతాప్, కానిస్టేబుల్ ఈరన్న, జీపు డ్రైవర్ మస్తాన్ హాలహర్వి స్టేషన్‌కు వచ్చి రాజశేఖర్, రమేష్ విచక్షణా రహితంగా కొట్టారు.
తామేం తప్పు చేయలేదని నెత్తీనోరు మొత్తుకున్నా వినిపించుకోకుండా బాదారు. అక్కడి నుంచి అదేరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కోర్టులో హాజరు పరిచేందుకు ఆదోనికి తీసుకొచ్చారు. సాయంత్రం 5కు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా తాము ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసులు దారుణంగా కొట్టారని రాజశేఖర్, రమేష్ దెబ్బలు చూపించారు.
మెజిస్ట్రేట్ వెంటనే స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని, ఇలాంటి అన్‌ఫిట్ రిమాండ్‌ను రిజెక్ట్ చేస్తున్నానని అన్నారు. వారి నుంచి టూటౌన్ పోలీసులకు కేసు అప్పజెప్పి వెంటనే వీరికి మెరుగైన చికిత్స చేయించాలని ఆదేశించారు. టూటౌన్ సీఐ శ్రీరాములు 14 రాత్రి వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు.