ఓ ప్రియుడు తన ప్రేయసికి ఓ ఒంటె పిల్లను దొంగతనం చేసి కానుకగా అందించాడు. అతడు చేసిన పనికి వాళ్లిద్దరూ అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన దుబాయ్ లో జరిగింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ఓ జంట తమ ఒంటె పిల్ల కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆ ప్రేమికుడు ఒంటె పిల్లను ఎత్తుకొచ్చిన ప్రాంతం నుండి 3 కి.మీ. దూరంలో దానిని వదిలిపెట్టి వచ్చాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తానే దాని జాడను చెప్పాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
ప్రేమికురాలికి గిఫ్టు ఇచ్చేందుకే ఈ దొంగతనం చేశానని అతడు పోలీసులకు తెలిపాడు. చోరీ చేయడమే కాకుండా తమను తప్పుదోవపట్టించినందుకు నిందితుడు, అతడి ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. అరబ్ దేశాల్లో పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా కొట్టాలు వేసి ఒంటెలను పెంచుతూ ఉంటారు. మరోవైపు, రేసుల కోసం కూడా కొంతమంది ఒంటెలను కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రత్యేక జాతులకు చెందిన ఒంటెలకు అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు.