ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ శాసనమండలి రద్దు లేనట్టే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2020, 01:11 PM

ఏపీ శాసనమండలిలో అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టినా అది ఇప్పటి వరకు చర్చకు రాలేదు. రూల్ 71 కింద టీడీపీ సభ్యులు బిల్లు చర్చకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బుధవారం మండలిలో బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ తనకున్న శక్తులన్నింటిని ఉపయోగిస్తూ బిల్లు చర్చకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే సీఎం జగన్ కూడా టీడీపీకి ధీటుగా తనకున్న ప్రత్యామ్నాయ మార్గాలకై అన్వేషిస్తున్నారు.


శాసనమండలి బిల్లును తిరస్కరిస్తే ప్రభుత్వం ఈ బిల్లును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రెండో సారి మండలికి పంపినా మరోసారి బిల్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మండలి రెండో సారి తిరస్కరించినా అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. కానీ రెండో సారి బిల్లును మండలికి పంపేందుకు ప్రభుత్వం సిద్దంగా లేనట్టు తెలుస్తోంది. అందుకే మండలిలో బిల్లు తిరస్కరణకు గురైతే 24 గంటల్లోనే గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్టు సమాచారం.


ఆర్డినెన్స్ తెచ్చిన 6 నెలలలోపు బిల్లును ఆమోదించి చట్టం చేయాల్సి ఉంటుంది. ఈ లోపు సీఎం జగన్ మండలిని రద్దు చేయవచ్చు. లేదా టీడీపీ ఎమ్మెల్సీలను బిల్లుకు మద్దతిచ్చేలా మార్చుకోవచ్చు. లేదా ఆరు నెలల తర్వాత ఆర్డినెన్స్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత మరోసారి కూడా ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చు. మండలిని రద్దు చేస్తే తిరిగి ప్రారంభించడం చాలా విధానాలతో కూడుకున్నది. కాబట్టి మండలి రద్దు కాకుండానే బిల్లులు గట్టేక్కేలా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆఖరి ప్రత్యామ్నాయంగా మండలికి రెండోసారి బిల్లును పంపి అసెంబ్లీ నిర్ణయంతో ఫైనల్ చేస్తారు కానీ మండలి రద్దు చేసే ప్రసక్తి ఉండదని కీలక నేత ద్వారా తెలుస్తోంది.


ఏపీలో 1958లో ఆర్టికల్‌-168 కింద జూలై 1న శాసనమండలి తొలిసారిగా ఏర్పాటైంది. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌, 1958 జులై 8న మండలిని అధికారికంగా ప్రారంభించారు. మండలి ఆవిర్భవించిన 27 సంవత్సరాల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ రద్దు చేశారు. అనవసరమైనది..జనాభాలో ప్రాతినిధ్యం లేనిదని ఎన్టీఆర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌పై భారం, చట్టాలు ఆమోదించడంలో జాప్యం కావడంతో రద్దు చేశారు.


ఇలా ఎన్నో కారణాలతో ఎన్టీఆర్‌ ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ తీర్మానించారు. మండలి కోసం 1990 జనవరి 22న అసెంబ్లీలో తీర్మానం చేశారు. 1990 మే 28న పార్లమెంటు ఎగువసభలో తీర్మానం పాస్‌ చేశారు. 1991లోక్‌సభ రద్దుతో మండలి పునరుద్దరణ తీర్మానం మరుగునపడింది. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 జులై 8న శాసన మండలి పునరుద్దరణకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ తీర్మానం చేసింది. 2006 డిసెంబర్ లో పార్లమెంట్‌ ఆమోదం పొందింది. 2007 జనవరి 10న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. 2007 మార్చి 30న ఏపీ శాసనమండలి మళ్లీ ఏర్పాటైంది. శాసనసభతో పాటు మండలి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com