సీనియర్ నటుడు చలపతిరావుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహిళలపై చలపతిరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో వేడుకలో మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని భూమిక ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యవతి, మహిళా ఉద్యమకారిణి దేవి తదితర నేతలు చలపతి రావుపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో వేడుక గత ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకలో ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే అంశంపై యాంకర్ రవి, తోటి మహిళా యాంకర్.. చలపతిరావును ప్రశ్నించగా ఆయన నోరుజారారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మహిళా సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.