ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేపకు కష్టమొచ్చింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2017, 01:33 AM

(అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి):మంచినీటి చెరువులో పెరిగిన చేప.. ఇటు రైతుకు.. అటు ప్రభుత్వానికి మంచి ఆదాయవనరు.. రొయ్యల సాగులో వచ్చే ఉప్పు నీరు చేపకు ప్రాణసంకటంగా మారింది. 3 నుంచి 4 ఉప్పుశాతాన్ని మ్త్రామే చేపలు తట్టుకుంటాయి. ఏ మ్త్రాం ఉప్పు శాతం పెరిగినా చెరువుల్లో పెరిగిన చేపకు రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.. పెరుగుదల దిగజారిపోతుంది. వ్యాధుల తీవ్రత అధికమవుతుంది. చివరిగా రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది. కొందరు అనధికార బోర్లు తవ్వగా వచ్చిన ఉప్పునీటిని రొయ్యల చెరువులకు పెట్టేస్తున్నారు. పక్కనే ఉన్న చేపల చెరువులు సాగు చేస్తున్నవారు ఉసూరుమంటున్నారు. జిల్లాలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొల్లేరు ప్రాంత సాగుదారులు నష్టాలను చవిచూస్తున్నారు. ఆక్వా రైతులకు సిరులు కురిపించిన చేపల పరిశ్రమ రోజురోజుకు తన ఉనికిని కోల్పోతోంది. వనామీ రొయ్యలసాగులో వినియోగిస్తున్న 12 నుంచి 20 ఉప్పు శాతం ఉన్న నీరు చేపల పరిశ్రమను కష్టాల్లోకి నెట్టివేస్తోంది. సాగులో వినియోగిస్తున్న ఉప్పునీటిని నేరుగా మంచినీటి కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. మంచినీటి లభ్యత తగ్గిపోవడంతో ఉన్న కాస్త నీరు ఉప్పుతో కలుషితమైపోతోంది. చిన్న చెరువులు ఉప్పు నీటి వల్ల ఖాళీ అయిపోతున్నాయి. పాత చేప పిల్లల నిష్పత్తి తగ్గిపోతోంది. సముద్రం నుంచి వచ్చిన ఉత్పత్తుల కన్నా మంచినీటితో సాగు చేసి సాధిస్తున్న ఉత్పత్తులే ఎక్కువ. దేశంలోనే రాష్ర్టం ఏటా 7.10 లక్షల టన్నుల్లో ఆక్వా ఉత్పత్తులను సాధిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం చేపలే. వనామీ రొయ్యల సాగుతో జిల్లాలో పరిస్థితులు మారిపోయాయి. వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉండడం, కొన్ని రకాల వ్కెరస్‌లను తట్టుకోవడంతో ఈ రకం రొయ్యలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. మూడు నెలలు కాపాడుకోగలిగితే రూపాయికి రూపాయి లాభం వస్తుండడంతో పెద్ద రైతులతోపాటు చిన్న రైతులు కూడా సాగు చేస్తూ తమ అద ష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


జిల్లాలో ఆక్వా సాగు ఇలా


జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1.40 లక్షల ఎకరాల్లో, అనధికారికంగా మరో 20 వేల ఎకరాల ఆక్వా రంగం విస్తరించింది. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి. 20 నుంచి 40 వేల ఎకరాల్లో రొయ్యల సాగు విస్తరించి ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే జిల్లాలో ఈ సాగు రెట్టింపయ్యింది. జిల్లాతోపాటు పశ్చిమగోదావరి, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం జిల్లాలో రొయ్యలసాగు వూపందుకుంది. భ్కెరవపట్నానికి చెందిన చదలవాడ శ్రీమన్నారాయణ ఇంగిలిపాకలంక పరిధిలో సుమారు 35 ఎకరాల్లో తెల్ల చేపల సాగుచేస్తున్నారు. చుట్టూ పెరిగిపోతున్న ఉప్పు నీటి రొయ్యల సాగు ఇబ్బందులకు గురి చేస్తోంది. మంచినీటి లభ్యత లేకపోవడంతో ప్రస్తుతం చెరువుల్లో ఉప్పు శాతం 6 శాతానికి పైగా పెరిగిపోయింది. మూడునెలలుగా రూ. 20 లక్షల విలువ్కెన మేతలు, మందులు వేశారు. ఒక్కో చేప కనీసం నెలకు 50 గ్రాముల పెరుగుదల రాలేదు. కొల్లేరు భూముల్లో సాధారణంగా నెలకు చేప 150 నుంచి 200 గ్రాముల పెరుగుదల ఉంటుంది. అయిదు నెలల్లో పట్టుబడికి రావాల్సిన చేపలు 8 నెలలైన నేటికీ రాలేదు. లీజులు, అన్ని కలిపి రూ. లక్షల్లో ఆ రైతుకు తీవ్ర నష్టం వచ్చింది. ఆ ప్రాంతంలోని చేపల చెరువులు సాగు చేస్తున్న అందరిదీ ఇదే పరిస్థితి. మండవల్లికి చెందిన సుబ్బరాజు 20 ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. వేసవికాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలతో నీరు ఆవిరై చెరువులో ఉప్పుశాతం భారీస్థాయిలో పెరిగిపోయింది. చేపలకు ప్రాణవాయువు, వ్యాధులతో నిత్యం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదురయ్యాయి. నష్టం వస్తే వచ్చిందని, చేపలకు ప్రస్తుతం అనుకున్న స్థాయిలో ధర పలకకున్నా పట్టుబడికి రాకముందే అమ్మి నష్టపోయారు.


రొయ్యల సాగుతో చేపలకు వచ్చే నష్టాలివి... 


రొయ్యల సాగులో వినియోగిస్తున్న నీరే చేపల సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. భూమిలో 200 నుంచి 400 మీటర్ల లోతులో అనధికార బోర్లను వేసి ఉప్పునీటిని బయటకు తోడి సాగు చేస్తున్నారు. జిల్లాలోని డెల్టా శివారు ప్రాంతం భూగరేంలోని నీటిలో 12 నుంచి 25 వరకు ఉప్పు శాతం ఉంటుంది. జిల్లాలో కొత్తగా తవ్వుతున్న ఏ ఒక్క చెరువుకూ మరుగుబోదె సౌకర్యం లేదు. సాగు తర్వాత ఉప్పునీటి నేరుగా కాలువలోకి విడుదల చేస్తున్నారు. ఈ నీరు చేపల చెరువుల్లోకి చేరి ఆ పరిశ్రమను నాశనం చేస్తోంది. చేపలు వ్యాధుల బారిన పడుతున్నాయి. ఎన్ని మందులు వేసినా వ్యాధులు నయం కాకపోవడంతో మత్యువాత పడుతున్నాయి. సాధారణంగా 5 కంటే ఎక్కువ ఉప్పు శాతం చేపల చెరువుల్లో ఉంటే పిల్లలు మత్యువాత పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని చెరువుల్లో 6 నుంచి 7 శాతం ఉప్పు ఉంటుంది. ఉప్పునీటితో చేపలను రకే్క్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా ప్రయోజనం కనిపించడంలేదు.


ప్రతికూల పరిస్థితులు


ఆక్వా రంగానికి ఆయువుపట్టయినా నీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు అధికం. గడచిన రెండు సంవత్సరాల్లో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల్లో ఆక్వా రంగం ఇబ్బందుల్లో పడింది. తీవ్ర వర్షభావ పరిస్థితులు, నీటి విడుదల లేకపోవడంతో డెల్టా ప్రాంతం తాగునీటికే కటకటలాడింది. ఈ ఏడాది మొదట్లో కాస్త నీరు వచ్చినా తర్వాత ఎద్దడి తప్పలేదు. చేపలు సక్రమంగా పెరగాలంటే మంచినీరు ఎంతో అవసరం. కనీసం ఏడాదికి ఒక్కసారైయిన చేపల చెరువుల్లో నీటిని మార్చి కొత్తగా నీటిని తోడుకుంటేనే పెరుగుదల ఉంటుంది. చేపల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగి రోగాలు సోకే ముప్పు తగ్గుతుంది. రొయ్యల చెరువులు రెట్టింపయ్యాయి. వేల క్యూసెక్కుల ఉప్పునీటిని బయటకు తోడేస్తున్నారు. కొల్లేరులో కూడా ఏటా పెద్దఎత్తున ఉప్పునీరు చేరిపోతోంది. చెరువుల్లో చేపలతోపాటు, కొల్లేరులోని నల్లజాతి చేపల సంతతి తగ్గిపోతోంది. సాధారణంగా చెరువులో చేప పిల్ల నెలకు 120 నుంచి 200 గ్రాముల వరకు పెరగాలి. ఉప్పు నీటి వల్ల కనీసం 50 గ్రాములు కూడా పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏటా 7.10 లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చేపల పరిశ్రమలో దిగుబడులు తగ్గి రొయ్యలు పెరుగుతున్నాయి.


పక్కా ప్రణాళికలు అవసరం


ఉప్పునీటితో విలవిలలాడుతున్న మత్స్య పరిశ్రమను గట్టెక్కించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలు తయారు చేయాలి. డ్క్రెనేజీ వ్యవస్థ ఉంటేనే రొయ్యల సాగుకు అనుమతులు ఇవ్వాలి. ఉప్పునీటి మళ్లింపునకు అవసరమైన చర్యలు పాటించాలి. నీటిని సముద్రం పాలు చేయకుండా ఆక్వా రంగానికి మళ్లించేందుకు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి. అవసరమయితే కాలువల్లోకి మంచినీటిని మళ్లించి నీటిని వథా కాకుండా చూడాలి. కొల్లేరు నీటి ప్రవాహం లేక వెలవెలబోతుంది. ఇందులోకి కొంత నీటిని మళ్లిస్తే ఉప్పుశాతం కాస్త తగ్గి పక్షులు, చేపలకు మేలు చేకూరుతుంది.


ఉప్పుశాతం పెరిగితే ప్రమాదమే :  కేవీఎస్‌. నాగలింగాచారి, మత్స్యశాఖ


చేపల చెరువుల్లో ఉప్పుశాతం పెరిగితే ప్రమాదమే. చేపల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోయి అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆహారాన్ని తీసుకోలేవు. పెరుగుదల నిలిచిపోతోంది. దిగుబడులు తగ్గుతాయి. సాధారణంగా 3 నుంచి 4 ఉప్పు శాతాన్ని చేపలు తట్టుకుంటాయి. అంతకంటే ఎక్కువ ఉంటే కదలలేని స్థితికి చేరుకుంటాయి. ఇంకా ఉప్పు శాతం పెరిగిపోతే మత్యువాత పడే అవకాశం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com