ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంట కొనే నాథుడు ఏడీ ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 12, 2017, 03:27 AM

అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి: ‘ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు తల్లడిల్లుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతకు ఈ వేసవిలో ధరల మంట మరింత మండిస్తోంది. వేసవిలో అందరికీ వడదెబ్బ తగిలితే అన్నదాతకు మాత్రం ధరల దెబ్బ తగిలింది. మిర్చి, పసుపు ధరలు భారీగా పతనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ధర లేకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు...’ పల్నాడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది మిర్చి దిగుబడి ఆశించి న స్థాయిలో రాగా పూర్తి పంట చేతి కొచ్చేటప్పటికీ ధర పాతాళానికి చేరింది. చాలామంది రైతులు మూడో కోతకు ఆసక్తి చూపించడం లేదు. మరో వైపు ధర మరింత తగ్గుతుందనే ఆందోళనతో రైతులు దుగ్గిరాల యార్డుకు పసుపును భారీగా తరలించుకు వస్తున్నారు. పెట్టుబడి వస్తుందనే నమ్మకం లేకుండా పోవడంతో వచ్చిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. పిడుగురాళ్ల, దుగ్గిరాల, పల్నాడులో ఒక్కొక్క ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఎకరాకు సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. ఒక్కొక్క కోత కోయటానికివందమంది కూలీలు అవసరమవుతున్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.250 చొప్పున చెల్లిస్తే తప్ప కూలికి రావటం లేదు. ఈ పరిస్థితుల్లో రైతు కోత కోయించి కూలికి ఇచ్చే డబ్బులు కన్నా పంటకు వచ్చే సొమ్ము తక్కువగా ఉంటోంది. దీంతో గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఎక్కువ మంది రైతులు మూడో కోతకు స్వస్తి పలికారు.


అప్పుల ఊబిలోకి రైతన్న


ఏటా రాష్ట్రంలో మిర్చి దిగుబడిలో పల్నాటి రైతాంగానిదే ప్రథమ స్థానం. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు లాభాలను ఆర్జించారు. దీంతో ఈ ఏడాది పిడుగురాళ్ల మండలంలో 2850 హెక్టార్లు, మాచవరం మండలంలో 2780 హెక్టార్లు, దాచేపల్లి మండలంలో 2838 హె క్టార్లు, కారంపూడి మండలంలో 2846 హెక్టార్లు, నకరికల్లు మండలంలో 193 హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. గత ఏడాది కంటే పెట్టుబడి ఎకరాకు రూ.50 వేల వరకు అదనంగా పెరిగిపోయింది. ప్రస్తుత పంట ధరతో పోల్చి చూస్తే రెండు ఎకరాలు మిర్చి పంట సాగు చేసిన రైతు సగటున రూ.2 లక్షల వరకు నష్టపోతాడు. ఈ పరిస్థితి సన్న, చిన్నకారు, కౌలు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. ప్రభు త్వం క్వింటాకు రూ.1500 అదనంగా చెల్లిస్తామ ని చేసిన ప్రకటన రైతులకు పెద్ద ఊరటనిచ్చినట్లు కనిపించటం లేదు.


దుగ్గిరాల యార్డుకు భారీగా తరలింపు


ధర మరింత తగ్గుతుందనే ఆందోళనతో రైతులు దుగ్గిరాల యార్డుకు పసుపును భారీగా తరలించుకు వస్తున్నారు. నానాటికీ ధర క్షీణిస్తుండటంతో పెట్టుబడి వస్తుందనే నమ్మకం లేకుండా పోవడంతో వచ్చిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. పదివేల బస్తాల వరకూ కడప, కర్నూలు, పల్నాడు ప్రాంతాలకు చెందిన రైతులతోపాటు పరిసర మండలాల్లోని రైతులు రెండు రోజులుగా పసుపును యార్డుకు తీసుకువచ్చారు. వ్యాపారుల పసుపు ఎక్కువగా పోత లు ఉండటంతో దూర్రపాంతాల నుంచి వచ్చిన రైతులు తమ పసుపును వేలంలో విక్రయించలేకపోయారు. రానున్న నెల రోజులు మరింత భారీగా యార్డుకు పసుపు పంట తరలిరానుంది. ఈఏడాది ధర లేకుండా పోవడం తో వచ్చే ఏడాది పంట వేసే ఉద్దేశం లేని రైతు లు కనీసం విత్తనానికి సైతం పసుపును నిల్వ చేసుకోకుండా మొత్తం పంటను విక్రయించేస్తున్నారు. క్వింటాకు కనీసం రూ.9 వేల మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయకుంటే వచ్చే ఏడాది పంట వేసే వారుండరని యార్డుకు వచ్చిన పలువురు రైతులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది సాగు మరింత కష్టమే వచ్చే ఏడాది మిరప సాగు కష్టమే. ఈ ఏడాది గిట్టుబాటు ధర లేకపోవటం, కూలి ఖర్చులు, కౌలు, పెట్టుబడి ఖర్చులు అధికం కావటంతో వచ్చే ఏడాది మిరపసాగు చేయడం సాహసమే. రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రూ. 4 వేలు కూడా లభించడం లేదు. క్వింటాల్‌కు కనీసం రూ. 4వేల ధర కూడా లభించడం లేదు. రైతు నష్టపోకుండా ఉండాలంటే రూ.9 వేల గిట్టుబాటు ధర ప్రకటించాలి.


కేంద్రం నుంచి స్పష్టత ఏదీ


మిర్చి రైతులకు మద్దతు విషయంలో కేంద్ర సాయంపై ఇంకా స్పష్టత రాలేదు. మార్‌‌కఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు చేస్తేనే నిధులిచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతోంది. అయినా అక్కడ నుంచి భరోసా వచ్చేదాకా ఎదురుచూడకుండా గురువారం నుంచి క్వింటాల్‌కు రూ.1500 ఇచ్చేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మిర్చి ధర భారీగా పడిపోవడంతో రూ.1500 చొప్పున ఒక్కో రైతుకు 20 క్వింటాళ్ల వరకు నగదు సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే మార్కెట్‌ స్థిరీకరణ పథకం కింద నిధులిచ్చి సాయం చేయాలని కేంద్రాన్ని అభ్యర్ధించింది. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి వ్యవసా యశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిశారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ, ఆర్థికశాఖ అధికారులతో రాష్ట్ర అధికారులు చర్చలు జరిపారు. మొత్తం 15లక్షల క్వింటాళ్ల మిర్చి రైతుల వద్ద ఉందని, క్వింటాల్‌కు రూ.1500 చొప్పున ఇస్తే రూ.225 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే మిర్చి విస్తీర్ణం 10శాతం పెరిగిందని, ధరలు 10శాతం తగ్గాయని గుర్తు చేశారు. ఈ నిబంధనలకు అనుగుణంగా మార్కెట్‌ స్థిరీకరణ కింద కేంద్రం సగం మొత్తాన్ని భరించాలని కోరారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. మార్‌‌కఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తేనే నిధులిస్తామని, నగదు సాయానికి వీలు కాదని తేల్చి చెప్పింది. తాము కొనుగోలు చేస్తే నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు లేవని మార్‌‌కఫెడ్‌ వివరించినా నిబంధనలు అంగీకరించవని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు మిర్చికి కొత్త విధానంలో నిధులిస్తే రాబోయే రోజుల్లో ఆయిల్‌పామ్‌, కొబ్బరి, బెల్లం, ఉల్లికీ అడుగుతారని పేర్కొన్నారు.  మిర్చి ధరలు పతనమవ డంతో పంటను నిల్వ చేసేందుకు రైతులు శీతల గిడ్డంగుల వద్ద పడిగాపులు పడుతున్నారు. కృష్ణా జిల్లా కంచిక చెర్ల మండలం కీసర వద్ద ఉన్న నిల్వకేం ద్రానికి ఇలా భారీగా వాహనాల్లో పంటను తీసుకువచ్చి టోకెన్లు తీసుకొని వంతుల వారీగా నిల్వ చేసుకుంటున్నారు. ప్రభుత్వ గోదాములు లేక పోవడం తో ప్రైవేటు కేంద్రాల వద్దకు తీసుకురావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com