ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతును నిలువునా ముంచిన మీరు భ‌రోసా ఇస్తారా? జ‌గ‌న్‌కి క‌ళా లేఖ‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2019, 12:44 AM

బహిరంగ లేఖ 


ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గారికి, 


నమస్కారములు..


 రైతుల గురించి మీరు చెప్పింది కొండంత.. చేస్తోంది గోరంత. రుణమాఫీ జీవో రద్దుతో రైతులను నిలువునా ముంచిన మీరు.. ఇప్పుడు రైతు భరోసా సాయానికి పెద్దమొత్తంలో కోత విధిస్తూ మరోసారి తడిగుడ్డతో వారి గొంతుకోశారు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. అన్నదాతలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు జవాబివ్వండి..


1. బడ్జెట్‌లో 64.06 లక్షల మందికి పథకం వర్తింపజేస్తామని హామీనిచ్చి.. అమలులో మాత్రం 54 లక్షలకు కుదించారు. 15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 3 లక్షలకు తగ్గించారు. ఇది నమ్మకద్రోహం కాదా..?


2. రైతులకు ఒకేదఫాలో ఏటా రూ.12,500 ఇస్తామని 2017లో జరిగిన ప్లీనరీలో  ప్రకటించారు. అంటే రాష్ట్ర నిధుల నుండే ఇస్తానని హామీనిచ్చారు. 2017 నాటికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ రూ. 6వేలు ప్రకటించలేదు. హామీపై నిలబడే వారైతే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు కేంద్రం ఇస్తున్న రూ.6వేలతో పాటు రాష్ట్రం నుండి రూ.12,500 మొత్తం రూ.18,500 వేలు ఇవ్వాలి. రూ.18,500కి బదులు రూ.13,500 ఇస్తామంటే రూ.5వేలు ఒక్కొక్క రైతుకు ఎగనామం పెట్టడం కాదా..?


3. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుండి రూ.13,500కి బదులు కేవలం రూ.7,500 మాత్రమే చెల్లిస్తూ.. రూ.13,500 ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది అబద్ధం కాదా..? రైతు దగా కాదా..?   


4. ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.50 వేల వరకు లబ్ధి చేకూరుస్తామని మేనిఫెస్టోలో తెలిపి.. (7,500þ5)  రూ.37,500మాత్రమే ఇస్తూ.. రూ.67,500 ఇస్తున్నట్లు చెప్పడం అబద్ధం కాదా..? ఇది రైతు ద్రోహం కాదా..?  


5. ''రైతు రుణమాఫీ రూ.1,50,000ను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారా..'' అని టీడీపీని విమర్శించిన వైకాపా.. ఒకే విడతలో రైతు భరోసా పూర్తిచేస్తామని ఘంటాపథంగా చెప్పి ఇప్పుడు రూ.7,500ని మూడు ముక్కలు చేయడం మాట తప్పడం కాదా..?


6. తెలుగుదేశం హయాంలో రూ. 50వేల లోపు రైతు రుణాలను ఒకే దఫాలో రద్దు చేసింది నిజం కాదా..? రైతు రుణమాఫీ ద్వారా ఒక్కో రైతు రూ.1,10,000 లబ్ధి పొందినది వాస్తవం కాదా..?  


7. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే.. 4, 5 విడతల రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు రూ.40వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.10వేలు చొప్పున ఒక్కో రైతుకు సగటున సుమారు రూ.50వేల వరకు ఇప్పుడు లబ్ధి చేకూరేది. ఆ పథకాల రద్దుతో మీరు రైతును దగా చేసింది వాస్తవం కాదా..? చంద్రన్నే అధికారంలో కొనసాగి ఉంటే రైతుకు రూ.90వేలు వచ్చి ఉండేవి. ఇందుకు మీరు ఇస్తున్నది కేవలం రూ.37,500లే కదా..?  


8. కులాలు, మతాలకతీతంగా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి.. నేడు నిబంధనల పేరుతో అన్నదాతల మధ్య కులాల కుంపట్లు పెట్టడం దుర్మార్గం కాదా..? 


9. కేంద్రం ఇచ్చిన 2వేల రూపాయలను జూన్‌ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేసినట్లు అర్థం వచ్చే విధంగా ప్రకటించడం.. రైతులను మోసగించడం కాదా..?    


10. సున్నావడ్డీ కింద రూ.4వేల కోట్లు ఇస్తామని.. బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే పెట్టారు. ఇది రైతు ద్రోహం కాదా..?  


11. ధరల స్థిరీకరణ నిధి ప్రకటించినా.. టమాటా, ఉల్లి రైతులకు మాత్రం మద్ధతు ధరను అందించడం లేదు. ఇది వంచన కాదా..? 


12. మీ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో 14,565 మంది రైతుల ఆత్మహత్యలకు పాల్పడితే.. మీ 4నెలల పాలనలోనే 190 మంది రైతులు బలయ్యారు. ఇక రైతు బతుకుకు మీరు కల్పించిన భరోసా ఏమిటి..?  


13. మీ తండ్రి హయాంలో ఉచిత విద్యుత్‌ అంటూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా జరిగిన విద్యుత్‌ సరఫరాతో 500 మంది పాముకాట్లకు గురై బలయ్యారు. మీ పాలనలో రోజుకు 3-4 గంటలు విద్యుత్‌ సరఫరానే ఉండటం లేదు. అలాంటప్పుడు 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ అంటూ చెప్పడం రైతుల్ని దగా చేయడం కాదా..? తెలుగుదేశం హయాంలో 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటును అధిగమించి 100 రోజుల్లోనే 24þ7 కరెంట్‌ సరఫరా చేసింది వాస్తవం కాదా..?      


14. మన విత్తనాలు తెలంగాణకు తరలించారు. విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడి ప్రాణాలు విడిస్తే కన్నెత్తి చూడలేదు. అలాంటి మీకు రైతు సంక్షేమంపై మాట్లాడే అర్హత ఎక్కడుంది..?  


15. వర్షాలు పడి కృష్ణా నదిలో వరద పొంగిపొర్లినా నేటికీ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని రిజర్వాయర్లు నింపలేకపోయారు. సుమారు 550 టీఎంసీల నీటిని సముద్రం పాలైన మాట వాస్తవం కాదా.?


గత ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే తక్కువ ఇస్తూ.. తెలుగుదేశం ప్రభుత్వం కంటే గొప్పగా చేస్తున్నామని అబద్ధాలతో ఇంకెన్నాళ్లు ప్రజలను మోసపుచ్చుతారు..? నిజంగా రైతుల పట్ల బాధ్యత ఉండి, వారి బాధలు అర్థం చేసుకున్న ఏ ఫ్రభుత్వమూ ఈవిధంగా వ్యవహరించదు. పైకి దయామయులమంటూ వైకాపా నాయకులు ఆడుతున్న జగన్నాటకాలను రైతన్నలు ఏనాడో గ్రహించారు. ఇప్పటికైనా మోసపుచ్చే వైఖరికి స్వస్తిపలికి.. రైతు రుణమాఫీ నిధులతో పాటు రైతులకు మీరు ఇస్తామన్న రూ.12,500ను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కేటాయించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి.   


                                                                                                                    Sd/- 


                                                                                                             (కళా వెంకట్రావు)           


                                                                                                    తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com