శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శనివారం రాత్రి 8 నుండి 10 గంటల వరకు వేంకటాద్రీశుడు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చాడు.
గజ వాహనం – కర్మ విముక్తి
రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి గజవాహనారూఢుడై తిరువీధులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ప్రతిరోజూ బ్రహ్మోత్సవాలలో వాహనసేవ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి.
కాగా, బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8 నుండి 10 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు దర్శనమిస్తారు.