ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్‌‌లైన్‌‌ షాపింగ్ చేయాలనుకుంటున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

national |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 01:38 PM

పండగ సమయం వచ్చేసింది. చాలా మంది కొత్త వస్తువులు, కొత్త వాహనాలు కొనేందుకు రెడీ అవుతుంటారు. అందుకే మనదేశంలోని రెండు అతిపెద్ద ఈ–కామర్స్‌‌ కంపెనీలు అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌లు ఫెస్టివల్‌‌ సేల్‌‌కు తెరతీశాయి. భారీ డిస్కౌంట్లు ఇస్తామని ఊరిస్తున్నాయి. అమెజాన్‌‌ ఈ నెల 29 నుంచి వచ్చే నెల నాలుగు వరకు గ్రేట్‌‌ ఇండియన్‌‌ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ప్రైమ్‌‌ మెంబర్లకు మాత్రం శనివారం నుంచే సేల్‌‌ మొదలయింది. ఎస్‌‌బీఐ కార్డులతో కొంటే పదిశాతం డిస్కౌంట్ పొందవచ్చు. సరిగ్గా ఇదే తేదీల్లో ఫ్లిప్‌‌కార్ట్‌‌ బిగ్‌‌ బిలియన్ డేస్‌‌ సేల్‌‌ జరుగుతోంది. ఆక్సిస్‌‌, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొంటే ఈ కంపెనీ కూడా పదిశాతం డిస్కౌంట్‌‌ ఇస్తున్నది. ఎక్సేంజ్‌‌ ఆఫర్లు, క్యాష్‌‌బ్యాక్‌‌లు, నో కాస్ట్‌‌ ఈఐఎం ఆఫర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి సేల్స్‌‌లో వస్తువులు కొంటే డబ్బు ఆదా చేయవచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌‌ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లు, స్మార్ట్‌‌స్పీకర్లు, స్మార్ట్‌‌వాచ్‌‌ల వంటి గాడ్జెట్లు కొనడానికి ఇదే బెస్ట్‌‌టైం. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కొంతమంది ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ చేసేటప్పుడు అప్రమత్తత పాటించకపోవడం వల్ల నష్టపోతుంటారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి.


అఫీషియల్‌‌ వెబ్‌‌సైట్లు, మొబైల్‌‌ యాప్స్‌‌ను చూడాలి


తక్కువ ధరలకే అమెజాన్‌‌లో, ఫ్లిప్‌‌కార్ట్‌‌లో వస్తువుల అమ్మకం అంటూ వాట్సప్‌‌ వంటి సోషల్ మీడియాలో పోస్టులు వస్తుంటాయి. అందులో ఇచ్చిన లింక్స్‌‌పై క్లిక్‌‌ చేస్తే ఫిషింగ్‌‌సైట్లు ఓపెన్‌‌ అవుతాయి. వాటి ద్వారా డబ్బులు చెల్లిస్తే నూటికి నూరుశాతం మోసపోయినట్టే! అలాంటి లింక్స్‌‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓపెన్‌‌ చేయకూడదు. గూగుల్‌‌లో సంబంధిత సైట్‌‌ ఆఫీషియల్‌‌ వెబ్‌‌లింక్‌‌ను వెతికిపట్టుకొని అందులోకి ఎంటర్‌‌కావాలి. లేకపోతే మొబైల్‌‌ యాప్స్‌‌ను కూడా డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవచ్చు. కొన్ని ఈ–కామర్స్‌‌ మార్కెట్‌‌ ప్లేస్‌‌లు యాప్స్‌‌లో ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఇస్తాయి.


కొనే దాని గురించి పూర్తిగా తెలుసుకోండి


మీరు డబ్బు చెల్లించే వస్తువు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కొందరు సెల్లర్లు పాత మోడల్‌‌, రీఫర్బిష్‌‌డ్‌‌ వస్తువును అంటగట్టే ప్రమాదం ఉంది. కస్టమర్ నుంచి వాపసు వచ్చినవాటిని రిపేర్‌‌ చేసి అమ్మే వస్తువులను రీఫర్బిష్‌‌డ్‌‌ గూడ్స్‌‌ అంటారు. కొన్ని వస్తువుల పేర్లు ఒకేలా ఉంటాయి. కొనేముందు వస్తువును తయారు చేసిన కంపెనీ పేరును తప్పకుండా చూడాలి. ఉదాహరణకు మీరు సోనీ హెడ్‌‌ఫోన్‌‌ కొనాలనుకుంటారు. అదే పేరుతో చాలా మంది సెల్లర్ల రీఫర్బిష్‌‌డ్‌‌/ఇతర కంపెనీల ప్రొడక్టులు ఉంటాయి. కంపెనీ పేరును, లిస్టింగ్‌‌ను సరిగ్గా పరిశీలిస్తే ఆ వస్తువు అసలుదా కాదా ? అనే విషయం తెలుస్తుంది.


పొరపాటు జరిగితే కస్టమర్‌‌ కేర్‌‌ను సంప్రదించాల్సిందే..


ఆన్‌‌లైన్‌‌లో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు కొందరు పొరపాటున ఒక వస్తువుకు బదులు మరో వస్తువు ఆర్డర్‌‌ చేస్తారు. కావాల్సిన దాని కంటే ఎక్కువ మొత్తంలో ఆర్డర్‌‌ చేస్తారు. ఇలా జరిగినప్పుడు తక్షణమే కంపెనీ కస్టమర్‌‌ కేర్‌‌ సర్వీసును సంప్రదించాలి. వాళ్లు సంబంధిత ప్రొడక్ట్‌‌ను క్యాన్సిల్‌‌ చేసి, డబ్బును వాపసు పంపుతారు. అడిగితే చిరునామాను కూడా మారుస్తారు. యాప్‌‌, వెబ్‌‌సైట్‌‌ ద్వారా కస్టమర్‌‌ కేర్‌‌ను సంప్రదించవచ్చు. ఫ్లిప్‌‌కార్ట్‌‌ ద్వారా ఏదైనా సమస్య వస్తే దానిని ట్విటర్‌‌ ద్వారా కూడా తెలియజేయవచ్చు. వెంటనే స్పందన వస్తుంది.


సెల్లర్‌‌‌‌ ఎంపిక ఎంతో ముఖ్యం


అమెజాన్‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌, స్నాప్‌‌‌‌డీల్‌‌‌‌ వంటి సైట్లు ఏవో కొన్ని వస్తువులు మినహా మిగతా అన్నింటినీ సొంతంగా అమ్మవు. వాటిలో రిజిస్టర్ అయిన థర్డ్‌‌‌‌పార్టీ సెల్లర్లు మాత్రమే ఈ సైట్లు/యాప్స్‌‌‌‌ ద్వారా అమ్ముతారు. ఏదైనా వస్తువును ఆర్డర్‌‌‌‌ చేసే ముందు, దానిని అమ్మే సెల్లర్‌‌‌‌, అతనికి ఉన్న రేటింగ్‌‌‌‌ను తప్పక పరిశీలించాలి. సెల్లర్‌‌‌‌ వస్తువులకు కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌‌‌‌బ్యాక్‌‌‌‌నూ చూడాలి. ‘న్యూ’ సెల్లర్స్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే అమెజాన్‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌లు సెల్లర్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌ చేస్తాయి. ‘ఫుల్‌‌‌‌ ఫిల్డ్‌‌‌‌ బై అమెజాన్’ అనే బ్యానర్‌‌‌‌ ఉన్న సెల్లర్‌‌‌‌ నుంచి ఆర్డర్‌‌‌‌ ఇవ్వడం మేలు. ఈ రేటింగ్‌‌‌‌ ఉన్న సెల్లర్‌‌‌‌ తన వస్తువులను అమెజాన్ గోడౌన్‌‌‌‌లో నిల్వ చేస్తాడు. కస్టమర్‌‌‌‌ ఫీడ్‌‌‌‌బ్యాక్‌‌‌‌ ఆధారంగా అమెజాన్‌‌‌‌ వీరికి రేటింగ్‌‌‌‌ ఇస్తుంది. ఇలాంటి సెల్లర్ల వస్తువులను రిటర్న్‌‌‌‌ చేయడం, రీఫండ్‌‌‌‌ పొందడం సులువు. డెలివరీ కూడా త్వరగా అవుతుంది. ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌లో మంచి సెల్లర్లకు ‘ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ అష్యూర్డ్‌‌‌‌’ అనే రేటింగ్‌‌‌‌ ఉంటుంది.


మరికొన్ని ముఖ్యమైన విషయాలు


మనం కొనాలనుకున్న వస్తువును కేవలం ఒకే వెబ్‌‌సైట్‌‌లో చూసి ఆర్డర్‌‌ ఇవ్వకూడదు. అదే వస్తువు ధర ఇతర వెబ్‌‌సైట్‌‌లో తక్కువ ఉండే అవకాశం ఉంది. అన్ని వెబ్‌‌సైట్లు చూడటం కష్టం అనుకుంటే మైస్మార్ట్‌‌ప్రైస్‌‌డాట్‌‌కామ్‌‌. డిజిట్‌‌డాట్‌‌ఇన్‌‌ వంటి అగ్రిగ్రేటింగ్‌‌ వెబ్‌‌సైట్లను, యాప్స్‌‌ను ప్రయత్నించవచ్చు.


ఫ్లిప్‌‌కార్ట్‌‌, అమెజాన్‌‌ కొన్ని ప్రొడక్టులకు మంచి రేటింగ్‌‌ ఇస్తాయి. వీటిని ఎంచుకోవడం మేలు. ఉదాహరణకు అమెజాన్‌‌ కొన్ని వస్తువులకు ‘అమెజాన్‌‌ చాయిస్‌‌’ రేటింగ్‌‌ ఇస్తుంది. ఫ్లిప్‌‌కార్ట్‌‌ ‘అష్యూర్డ్‌‌’ రేటింగ్‌‌ ఇస్తుంది. తగిన ధర, మంచి నాణ్యత, స్పీడ్‌‌ డెలివరీ ఉన్న వాటికే ఇలాంటి రేటింగ్స్‌‌ ఇస్తామని ఈ కంపెనీలు చెబుతున్నాయి.


మనకు నచ్చిన వస్తువును కార్ట్‌‌లో వేసి పెట్టుకుంటే ధర తగ్గినప్పుడు ఆయా సైట్లు వెంటనే నోటిఫికేషన్లు లేదా మెసేజ్‌‌లు పంపిస్తాయి.


తరచూ షాపింగ్‌‌ చేసే వాళ్లు అమెజాన్‌‌ ప్రైమ్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ ప్లస్‌‌ మెంబర్షిప్‌‌లు తీసుకోవడం వల్ల డబ్బు ఆదా చేయవచ్చు. ఇవి ఉన్న కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు ఉంటాయి. డెలివరీ చార్జీలు వసూలు చేయరు. డీల్స్ వివరాలు కొన్ని గంటలు ముందస్తుగా తెలుస్తాయి. ఎక్స్‌‌క్లూజివ్‌‌ సేల్స్‌‌ కూడా ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com