ట్రెండింగ్
Epaper    English    தமிழ்

29న‌ మహతిలోఆదిభట్ల నారాయణదాస 155వ జ‌యంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 22, 2019, 08:08 PM

హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస 155వ జయంతిని పురస్కరించుకుని ఆగష్టు 29వ తేదీ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జ‌యంతి మహోత్సవం వైభవంగా జరుగనుంది. టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.


ఇందులో భాగంగా ఆగ‌స్టు 29వ తేదీ సాయంత్రం 6.00 నుంచి రాత్రి 10.00 గంటల వరకు నారాయణదాస సాహిత్యంపై ప్రముఖ పండితుల పత్ర సమర్పణ, ప్ర‌ముఖ కళాకారులతో హరికథాగానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా ఉదయం ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలోని శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి పుష్పాంజలి, బృందగానం నిర్వహిస్తారు.


నారాయణదాసవర్యులు 1864, ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో శ్రీలక్ష్మీనరసమాంబ, వేంకటచయన దంపతులకు జన్మించారు. సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే ఈయన అద్భుతమైన ప్రతిభాపాఠవాలు ప్రదర్శించేవారు. పోతన భాగవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వల్లించేవారు. ఉపమాన ఉపమేయాలను పోషించండంలో నారాయణదాసవర్యులు కాళిదాస మహాకవికి సమానమైనవారు. వీరు రచించిన హరికథా రచనలు, సాహిత్యగ్రంథాలు, సంగీతరూపకాలు కవి, గాయక, పండితులకు మనోజ్ఞమైన ఆనందాన్ని కలిగించాయి. ఈయన రచించిన సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయంలో నాలుగు వేదాలు లాంటివి. ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్రదర్శించడం ఈయనకే సాటి. ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉంది. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు నారాయణదాసు అని తిరుపతి వేంకటకవులు, శ్రీశ్రీ లాంటి మహానుభావులు కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com