ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌ర్ణాట‌క సంక్షోభంలో సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 12:16 PM

క‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి సార‌థ్యంలో కొన‌సాగుతున్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వం అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో..దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం కీల‌క పాత్ర పోషించింది. క‌ర్ణాట‌క‌కు చెందిన ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేల రాజీనామాల వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. త‌మ రాజీనామాల‌పై త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని, తాము దాఖ‌లు చేసిన పిటీష‌న్‌పై స‌త్వ‌ర నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాలంటూ వారు చేసిన అభ్య‌ర్థ‌న‌ను తోసిపుచ్చింది. ఇప్ప‌టికిప్పుడు త‌మ ఆదేశాల‌ను వెల్ల‌డించ‌డం సాధ్యం కాద‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం తేల్చిచెప్పింది.


అధికార పార్టీ బ‌ల‌పరీక్ష‌ను ఎదుర్కొంటున్న త‌రుణంలో- తాము దీనికి సంబంధించిన ఎలాంటి అంశంపైనా ఆదేశాల‌ను ఇవ్వ‌లేమ‌ని వెల్ల‌డించింది. ఆ ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంక‌ర్‌, హెచ్ న‌గేష్‌. గ‌త ఏడాది జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శంక‌ర్ హ‌వేరి జిల్లాలోని రాణిబెన్నూర్‌, హెచ్ న‌గేష్ కోలార్ జిల్లా ముళ‌బాగిలు నియోజక‌వ‌ర్గాల నుంచి విజ‌యం సాధించారు. అనంత‌రం వారు కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చారు. ఈ ఇద్ద‌రిలో శంక‌ర్.. కుమార‌స్వామి ప్ర‌భుత్వంలో అట‌వీశాఖ మంత్రిగా ప‌నిచేశారు. అనంత‌రం మారిన స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. శంక‌ర్‌తో పాటు న‌గేష్ కూడా కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మికి గుడ్‌బై చెప్పారు. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన 16 మంది కాంగ్రెస్ స‌భ్యుల‌తో క‌లిశారు.బ‌ల‌ప‌రీక్ష నేప‌థ్యంలో- తాము చేసిన రాజీనామాల‌పై స‌త్వ‌రమే విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ వారు శ‌నివారం సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగొయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఇప్ప‌టికిప్పుడు విచార‌ణ చేప‌ట్ట‌డానికి నిరాక‌రించింది. అవ‌స‌ర‌మైతే మంగ‌ళ‌వారం దీన్ని విచారిద్దామ‌ని రంజ‌న్ గొగొయ్ వ్యాఖ్యానించారు. సోమ‌వారం నాడు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బ‌ల‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించాల్సిందేనంటూ ప్ర‌తిప‌క్ష భార‌తీయ జ‌న‌తాపార్టీ ప‌ట్టుబ‌డుతోంది. ఇప్ప‌టికే అధికార కూట‌మి ఉద్దేశ‌పూర‌కంగా కాల‌యాప‌న చేస్తోంద‌ని అంటూ ప్ర‌తిప‌క్ష నేత బీఎస్ య‌డ్యూర‌ప్ప విమ‌ర్శిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com