ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ర్టమంతటా స్మార్ట్‌ పవర్‌ గ్రిడ్గ్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2017, 12:52 AM

విజయవాడ, సూర్య బ్యూరో : విద్యుత్‌ సరఫరా, పంపిణీ నష్టాలను ఈ ఏడాది కనీసం ఒక శాతం తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. 2016లో 10.51 శాతంగా వున్న టీ అండ్‌ డీ నష్టాలను ప్రస్తుతం 9.82 శాతానికి తగ్గించగలిగామని, ఈ ఏడాది చివరికి దీన్ని మరో 1 శాతం తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం మిషన్‌ లెర్నింగ్‌, డ్రోన్‌ టెక్నాలజీలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు అందుబాటులో వున్న డేటాను ఉపయోగించి ఏ లైను దగ్గర సాంకేతిక నష్టం వాటిల్లుతోందో గమనించి తక్షణం నష్ట నివారణ చర్యలు తీసుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరడం చాలా సులువని విశ్లేషించారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్లకు ఫైబర్‌ గ్రిడ్‌ అనుసంధానం చేస్తున్నందున సరఫరా, పంపిణీ నష్టాలను స్పష్టంగా అంచనా వేసే అవకాశం మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ శామంత్రి కిమిడి కళా వెంకట్రావుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కార్యాలయంలో ఇంధన శాఖ పనితీరు, విద్యుత్‌ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపి లక్ష్యాలను నిర్దేశించారు. వినియోగదార్లకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, విద్యుత్‌ పంపిణీ నష్టాలు తగ్గింపు అంశంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. సరఫరా లోపాల తగ్గింపు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని సీఎం కోరారు. పంపిణీలో నష్టాలు తగ్గితేనే అంతర్జాతీయ స్థాయిలో విద్యుత్‌ సరఫరా సాధ్యమని అన్నారు. ఈనెల 27, 28 తేదీలలో విశాఖపట్నంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విద్యుత్‌ మంు్తల్ర సదస్సు జరగనుందని, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మన రాష్ర్ట విద్యుత్‌ రంగం సాధించిన విజయాలు దేశం మొత్తం అధ్యయనం చేస్తుందని చెప్పారు. రాష్ర్టంలో గల సౌర, పవన, జల, థర్మల్‌ విద్యుత్‌ వ్యవస్థలన్నింటినీ అనుసంధానం చేసే విధానాన్ని అధ్యయనం చేసి ఎక్కడికక్కడ స్మార్ట్‌ పవర్‌ గ్రిడ్లుగా ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. స్మార్ట్‌ పవర్‌ గ్రిడ్‌ ఒక్కటే భవిష్యత్‌ అవసరాలను తీర్చగల విధానమన్నారు. ఉత్పత్తి చేసుకున్న విద్యుత్‌ను ఎలా నిల్వ చేసుకోవాలో, అది ఎంత తక్కువ ఖర్చులో చేసుకో గలమో ప్రపంచంలో గల ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ అధ్యయన బాధ్యతలను నాలెడ్జ్‌ పార్టనర్‌కు అప్పగించారు. అంతే గాక, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అంశాలపై నిర్ధిష్టంగా అంచనా వేసేలా నాలెడ్గ్జ పార్టనర్‌ సహకారం అందించాలని చెప్పారు. త్వరలో ఏర్పాటు చేయబోయే ఇంథన విశ్వవిద్యాలయం విద్యుత్‌ రంగంలో ఉత్తమ పద్ధతులు, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విధానాలకు నెలవుగా వుంటుందన్నారు. ఇప్పటివరకు వున్న సంప్రదాయ వీధి దీపాలు, విద్యుత్‌ స్థంభాల స్థానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాజూకైన, విపత్తులను తట్టుకోగల బల మైన విద్యుత్‌ స్థంభాలను, దీపాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. వీటికోసం పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని రాష్ర్టంలోని అన్ని పట్టణ ప్రాంతాలలో ఒకే తరహా విద్యుత్‌ దీపాలు, స్థంభాలు వుండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పైలట్‌ ప్రాజెక్టుగా విశాఖ, తిరుపతి నగరాలలో ఈ తరహా వీధి దీపాలు, నాజూకైన స్థంభాలు వెంటనే అమర్చాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలలో ప్రస్తుతం 20 విద్యుత్‌ వీధి దీపాలకు సెన్సర్‌ చొప్పున అమర్చి పర్యవేక్షిస్తున్నామని, ఈ విధానాన్ని త్వరలో రాష్ర్టమంతటా అమలు చేసి అవసరమైతే సీసీ కెమరాల ద్వారా వీధి దీపాల నిర్వహణను పరిశీలిం చాలని అన్నారు. రాష్ర్టంలోని వ్యవసాయ పంపుసెట్లు అన్నింటినీ విద్యుత్‌ ఆదా చేసే పంపుసెట్లుగా, లేదా సౌర విద్యుత్‌ ఆధారిత పంపుసెట్లుగా మార్చడంలో వీటిలో ఏది తక్కువ వ్యయంతో కూడినదో అధ్యయనం చేసి ఆ విధంగా మార్పు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పునరుత్పాదక విద్యుత్‌ వ్యవస్థపై ప్రభుత్వం పూర్తి దష్టి పెట్టిందని, భవిష్యత్తులో సౌర విద్యుత్‌ ధరల విషయంలో సంభవించే హెచ్చుతగ్గులను దష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే సరైన కార్య ప్రణాళిక వుండాలని అన్నారు. రానున్న కాలంలో ప్రతి ఇల్లు ఒక మైక్రో సోలార్‌ పవర్‌ జనరేషన్‌ ప్లాంటుగా మారే విధంగా సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం వున్నదన్నారు. వ్యవసాయ, గృహ విద్యుత్‌ నూతన కనెక్షన్ల విషయం లో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వినబడితే సహించబోనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం నూతన కనెక్షన్‌ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి ఐవీఆర్‌ఎస్‌ విధానంలో అభిప్రాయ సేకరణ జరుగుతుందని, ఎవరైనా అవినీతికి పాల్పడితే ప్రజలు నిర్మొహమాటంగా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఇటువంటి ఆరోపణలపై ఉపేక్షించకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ స్థాయిలో జూనియర్‌ లైన్‌ మేన్ల పోస్టులు చాలా ఖాళీగా వున్నాయని అధికారులు తెలుపగా, అత్యవసరం అనుకుంటే అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యుత్‌ ఉద్యోగుల వయో పరిమితి పెంపు అంశంపై తాను సాను కూలంగా వున్నానని, అయితే ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి తుది నిర్ణయానికి రావాల్సివుంటుందని చెప్పారు.


    ఇంధన వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, ఏపీ ట్రాన్స్‌కో సీయండీ కె.విజయానంద్‌ ఇంధన శాఖ సాధించిన విజయాలను, మైలురాళ్లను ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్‌ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే స్వయం ప్రకాశితం కావడమే కాకుండా మిగులు సాధించి దేశంలోనే ఆదర్శ నమూనాగా నిలిచిందని చెప్పారు. సమావేశంలో ముఖ్యమంత్రి అదనపు కార్య దర్శి ఏవీ రాజమౌళి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ జైన్‌, ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్‌, డిస్కమ్స్‌ సీఎండీలు, నెడ్‌ క్యాప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమలాకరరావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com