ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవ్యాంధ్రలో రోడ్లకు మహర్దశ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 27, 2017, 01:19 AM

 -ఏపీలో ఉగాదిన ఏడు ప్రధాన రోడ్లకు శంకుస్థాపన


 -ఇప్పటిేక సీఆర్‌డీఎ టెండర్లకు ఆహ్వానం


 -శంఖుస్థాపన ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు


(అమరావతిసూర్యప్రధాన ప్రతినిధి) నవ్యాంధ్రలో రహదారులకు మహర్దశ పట్టనుంది. రాజధానికి ప్రజలు సుళువుగా చేరుకునేలా వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రతిష్టాత్మకమైన ఏడు సబ్‌ ఆర్టీరియల్‌ రహదారుల నిర్మాణానికి ఈనెల 29 ఉగాది పర్వదినాన భూమి పూజ జరగనుంది. యర్రబాలెం-పెనుమాక రోడ్డుకు తూర్పుదిశగా ఉన్న ప్రాంతంలో శంకుస్థాపన నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు శంకుస్థాపన స్థల పరిశీలన కూడా పూర్తి చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా రాష్ర్టప్రభుత్వం రూ.915 కోట్ల వ్యయంతో ఏడు సబ్‌ ఆర్టీరియల్‌ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. ఈ రహదారులను నిర్మించేందుకు సీఆర్‌డీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 29వ తేది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు చేతులమీదుగా ఈ రోడ్లకు శంకుస్థాపన జరిపించేందుకు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది. రాజధాని ప్రాంతంలో భాగంగా ఉన్న యర్రబాలెం పంచాయతీ పరిధిలో యర్రబాలెం-పెనుమాక రోడ్డుకు తూర్పుదిశగా వున్న ప్రాంతంలో శంకుస్థాపన నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. శంకుస్థాపన నిమిత్తం ఎంపిక చేసిన ఈ స్థలాన్ని అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్ధసారధి, జడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు తదితర అధికారులు పరిశీలించారు. 


    శంకుస్థాపనకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండేకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. 


ప్రారంభమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం


రాజధానికి సంబంధించి ఇప్పటికే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారికి అనుసంధానంగా రాజధానిలోని లేఅవుట్లను కలుపుతూ ఏడు ప్రాధాన్య రోడ్లను మాస్టర్‌ ప్లానలో మార్కింగ్‌ చేశారు. ఈ రోడ్ల నిర్మాణం వలన రాజధానిలో ఏ ప్రాంతానికి అయినా 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో చేరుకోనేందుకు వీలు కలుగుతుంది. వీటికి సంబంధించి ఇప్పటికే గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కతిక శుక్ల పలుమార్లు సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమై రోడ్ల నిర్మాణాలకు భూసేకరణ ఆటంకాలు లేకుండా చేశారు. డీజీపీఎస్‌ సర్వే తదితర పనులు కూడా పూర్తి చేశారు. రాష్ర్ట ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో నిర్మించనున్న ఏడు ప్రాధాన్యత సబ్‌ ఆర్టీరియల్‌ రహదారులను ఇ-8, ఎన్‌-9, ఎన్‌-4, ఎన్‌-14, ఇ-10, ఇ-14, ఎన్‌-16గా వ్యవహరించబోతున్నారు. ఈ రోడ్ల నిమిత్తం మొత్తం 331.1 హెక్టార్ల భూమిని వినియోగించుకోనున్నారు. ఈ ఏడు రహదారులను నాలుగు ప్యాకేజిలుగా విభజించి నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఈ రహదారుల వెంట రూ 6.46 కోట్ల వ్యయంతో గ్రీనరీని కూడ అభివ ద్ధి చేసేవిధంగా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఏడు ప్రాధాన్యత రహదారుల వెంబడి మొత్తం 64,605 మొక్కలను నాటేవిధంగా ప్రణాళికను రూపొందించారు. మొదటి ప్యాకేజి కింద ఇ-8 రహదారిని కష్ణాయపాలెం నుంచి నెక్కల్లు వరకు 13.65 కి.మీ పొడవున నిర్మిస్తారు. రూ.221 కోట్ల వ్యయంతో దీనిని నాలుగులేన్ల రహదారిగా అభివ ద్ధి చేస్తారు. ఈ రహదారి మార్గంలో మూడు బ్రిడ్జిలు, 17 కల్వర్టులను నిర్మించాల్సివుంది. రెండో ప్యాకేజి కింద ఎన్‌-9 రహదారిని ఉద్దండరామునిపాలెం నుంచి నిడమర్రు వరకు 13.16 కి.మీ. పొడవునా ఉత్తర-దక్షిణ దిశలుగా నిర్మిస్తారు. రూ.197 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ నాలుగులేన్ల రహదారిమార్గంలో రెండు బ్రిడ్జిలు, 17 కల్వర్టులను నిర్మించాల్సివుంది. మూడో ప్యాకేజి కిందఎన్‌-4, ఎన్‌-14 రహదారులను నిర్మించనున్నారు. ఎన్‌-4ను వెంకటపాలెం-నవులూరు మధ్య 7.23 కి.మీల నిడివిలో రూ 116 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఈ రహదారి మార్గంలో రెండు బ్రిడ్జిలు, 12 కల్వర్టులు రానున్నాయి. ఇదే ప్యాకేజికింద చేపట్టనున్న ఎన్‌-14 రహదారిని కూడ నాలుగులేన్ల రహదారిగా బోరుపాలెం-శాఖమూరుల మధ్య 8.27 కి.మీ.ల పొడవున నిర్మించనున్నారు. ఈ మార్గంలో కూడ రెండు బ్రిడ్జిలు, ఏడు కల్వర్టులు రానున్నాయి. నాలుగో ప్యాకేజి కింద ఇ-10, ఇ-14, ఎన్‌-16 పేర మూడు రహదారులను నిర్మిస్తారు. వీటిలో ఇ-10ను పెనుమాక-ఐనవోలు మధ్య, ఇ-14ను మంగళగిరి-నీరుకొండ మధ్య, ఎన్‌-16ను అబ్బురాజుపాలెం-నెక్కల్లు మధ్య నిర్మించేవిధంగా ప్రతిపాదించారు. ఇవి కూడ నాలుగులేన్ల రహదారులే. ఇ-10 రహదారిని 7.81 కి.మీ.ల నిడివిలో రూ.105 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ మార్గంలో ఒక్క బ్రిడ్జి, 14 కల్వర్టులు రానున్నాయి. ఇ-14 రహదారిని 7.33 కిలోమీటర్ల నిడివిలో రూ 71 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఈ మార్గంలో 12 కల్వర్టులను నిర్మించాల్సివుంది. ఎన్‌-16 రహదారిని 8.77 కి.మీ.ల నిడివిలో రూ 102 కోట్ల వ్యయంతో నిర్మించేవిధంగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో ఒక్క బ్రిడ్జి, 12 కల్వర్టులు రానున్నాయి. దీంతో నవ్యాంధ్రలోని ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులు అందుబాటులోకి రానున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com