ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం పేపర్ లీక్ కాలేదని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి భరోసా ఇచ్చారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత నెల 27 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,430 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని శాంతినికేతన్ జూనియర్ కళాశాలలో పరీక్షకు గంట ముందు ఇంటర్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం పేపర్ లీకయిందంటూ కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ప్రసారమైందన్నారు. వెంటనే స్పందించి, అధికారులతో దర్యాప్తు చేయిస్తే, ఎక్కడా పేపర్ లీక్ కాలేదని వెల్లడయ్యిందన్నారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో శాంతినికేతన్ విద్యా సంస్థ సహా 7 విద్యా సంస్థల ఇంటర్ పరీక్షా పత్రాలను భద్రపరుస్తున్నామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం పేపర్ల కోసం మంగళవారం ఉదయం 8.20 గంటలకు పోలీస్ స్టేషన్ కు స్థానిక విద్యాధికారులు వెళ్లారన్నారు. 8.30 నిమిషాలకు స్టేషన్ నుంచి పేపర్లు తీసుకున్నట్లు పోలీస్ స్టేషన్ లాగ్ బుక్ లో 7 కళాశాలకు చెందిన 17 మంది సంతకాలు చేశారన్నారు. 8.40 నిమిషాలకు శాంతినికేతన్ కళాశాలకు చేరుకున్నారని, 8.45 నిమిషాలకు చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలో సీల్ ఓపెన్ చేశారని ఆమె తెలిపారు. 8.50 నిమిషాలకు కళాశాలలో ఉన్న రూమ్ లకు ఇంటర్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం పరీక్షా పత్రాన్ని తీసుకెళ్లారన్నారు. దీన్ని గమనిస్తే, గంట ముందు పరీక్షా పత్రం లీక్ అయ్యిందంటూ వచ్చిన వార్తలు అవాస్తమని ఆమె కొట్టిపారేశారు. 11 గంటలకు పేపర్ లీకయ్యిందంటూ గుంటూరు జిల్లా ఆర్.ఐ. సెల్ ఫోన్ కు మెసేజ్ ద్వారా ఓ విలేకరి కెమిస్ట్రీ పేపర్ ను పంపించారన్నారు. ఆ విలేకరికి ఎక్కడి నుంచి ఈ పేపర్ వచ్చింది, ఆయనకు ఎవరు ఇచ్చారు? అనే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కొన్ని విద్యా సంస్థల మధ్య మనస్పర్థల కారణంగా కూడా పేపర్ లీకేజ్ అంటూ రూమర్లు వస్తున్నాయన్నారు. ఇటువంటి రూమర్లు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహిస్తున్నామన్నారు. గడువుకు అరగంట ముందే విద్యార్థులు పరీక్ష ముగించుకుని వెళ్లిపోవొచ్చునన్నారు. పరీక్షా సమయంలో ప్రశ్నాపత్రం ఆలస్యంగా ఇస్తే, సంబంధిత విద్యా సంస్థల్లో ఆ సమయం మేరకు విద్యార్థులకు పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. పరీక్షలు జరుగుతున్న 1,430 కేంద్రాల్లోనూ తాగునీటి సదుపాయాలు కల్పించామన్నారు.
ఏప్రిల్ 12న ఫలితాలు...ఈ నెల 5 నుంచే ఇంటర్ సంస్కృతం, తెలుగు వంటి లాంగ్వజ్ పేపర్లతో స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభించినట్లు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. ఈ నెల 12 తేదీ నుంచి మిగిలిన పరీక్షా పత్రాల స్పాట్ వాల్యూయేషన్ చేపడతామన్నారు. ఏప్రిల్ 12న ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని ఆమె వెల్లడించారు. దేశంలోనే మొదటిసారి ఇంటర్ లో గ్రేడింగ్ అమలు-
మార్కులకు బదులు గ్రేడింగ్ లు ఇవ్వడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటు పరీక్షలు ప్రశాంతంగా రాయడానికి అవకాశం కలుగుందని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్షి తెలిపారు. 90 నుంచి 100 మార్కులకు ఎ1 గ్రేడింగ్, 80 నుంచి 90 మార్కులకు ఎ గ్రేడింగ్, 70 నుంచి 80 మార్కులకు బీ గ్రేడింగ్ ఇస్తామన్నారు. అన్ని సబ్జెక్టులకూ కలిపి క్యూమిలేటివ్ గ్రేడ్ పాయింట్ల(సీజీపీ) కింద గ్రేడింగ్ ఇస్తామన్నారు. గత సంవత్సరం నుంచి గ్రేడింగ్ అమలు చేస్తున్నామన్నారు. దేశంలోనే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మొదటిసారిగా గ్రేడింగ్ ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోతుందన్నారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.
![]() |
![]() |