సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కోసం రైతులు, ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్న భూముల వ్యవహారం వివాదంగా మారింది. 15 ఏళ్ల కిందట తమ నుంచి కొనుగోలు చేసిన భూముల్లో సిమెంటు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారని, అదేవిధంగా తమకు ఉపాధి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారని ‘సరస్వతి’ కోసం భూములు ఇచ్చిన పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన చెబుతున్నారు. కానీ, ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు చేయకపోగా, తమకు ఉపాధి కూడా కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ భూములు తమకు ఇచ్చేయాలని వారు పట్టుబడుతున్నారు. లేకపోతే.. ప్రస్తుత ధర ప్రకారం ఎకరానికి రూ.18 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఉంటే తక్షణమే పరిశ్రమ ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆదివారం భూములు ఇచ్చిన రైతులు, స్థానికులు మీడియాతో మాట్లాడారు. ‘‘మీ గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తాం. అర్హతలు ఉన్న వారికి పరిశ్రమలో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అని అనేక హామీలు ఇచ్చారు. 15 ఏళ్ల కిందట అతి తక్కువ ధరలకే మా నుంచి భూములు కొనుగోలు చేశారు. కానీ, ఇప్పటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు’’ అని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ భూములు తిరిగి తమకు అప్పగించాలని కోరారు. భూములు కొని సుమారు 15 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్నారు. కానీ, అప్పట్లో రెండు మూడేళ్లలోనే నిర్మాణం చేపడతామని నమ్మబలికారని తెలిపారు. పరిశ్రమను నిర్మిస్తే తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు వస్తాయని, తమకు ఉపాధి దొరుకుతుందని, గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశపడి తక్కువ ధరలకే భూములు ఇచ్చినట్టు చెప్పారు. పరిశ్రమ నిర్మాణం గురించి అడిగితే చూస్తాం, చేస్తాం అని చెప్పటమే కానీ.. నిర్మించింది లేదన్నారు. పరిశ్రమను నిర్మించే వరకు ఎవరి భూములు వారు సాగు చేసుకుంటామని, నిర్మాణం మొదలు పెట్టగానే ఇచ్చేస్తామని తాము చెప్పినా యాజమాన్యం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.