ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎంగా ఒమర్ అబ్దులా నేడు ప్రమాణం.. ప్రభుత్వంలో చేరికపై కాంగ్రెస్ షాకింగ్ నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2024, 09:15 PM

జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో ఎన్సీ- కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 90 స్థానాలున్న కశ్మీర్ అసెంబ్లీలో ఈ కూటమి 48 సీట్ల సాధించి అధికారం చేపడుతోంది. ఒమర్ అబ్దుల్లాకు మరో ఆరుగురు స్వతంత్రులు కూడా మద్దతు ఇస్తున్నారు. అయితే, ప్రభుత్వంలో చేరే విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బయట నుంచే ఒమర్ అబ్దుల్లాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి తన క్యాబినెట్‌లో ఓ మంత్రి పదవి కూడా ఒమర్ కేటాయించారు. కానీ, ప్రభుత్వంలో చేరరాదని నిర్ణయించిన కాంగ్రెస్.. మంత్రి పదవిని తిరస్కరించింది.


ఇక, శ్రీనగర్‌లో జరిగే ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణం స్వీకారానికి కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా హాజరవుతున్నారు. పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్నారు. చివరిగా 2014లో అక్కడ ఎన్నికలు జరిగి.. పీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. కానీ, 2019లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఆ ఏడాది షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఐదేళ్లూ రాష్ట్రపతి పాలనే కొనసాగింది.


సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవల అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎన్సీ 42 స్థానాలు, కాంగ్రెస్ 6, బీజేపీ 29, పీడీపీ 3, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ గ్రాఫ్ సగానికి పడిపోయింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ 12 సీట్లను గెలుచుకుంది. కాగా, శాసన సభా పక్ష నేతగా ఒమర్ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని ఇండియాా కూటమి పార్టీలు లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సిన్హాను కోరాయి. దీంతో 16న కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి ఆయన ఆహ్వానించారు.


ఇక, జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం సోమవారం గెజిట్‌ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము సంతకం చేయగా.. వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. 2018లో బీజేపీ, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమి ప్రభుత్వం కూలిపోగా.. శాసనసభను రద్దు చేసి, ఆరు నెలలపాటు గవర్నర్ పాలన విధించారు. అది ముగియడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన అమల్లోకి తీసుకొచ్చింది. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం.. జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com