ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం ఎలాంటి మోసపూరిత అంశాలు లేకుండా పరస్పర అంగీకారంతో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతోన్న శారీరక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ వాగ్దానం మొదటి నుంచి నేరపూరితమని రుజువైతే తప్ప ఏకాభిప్రాయంతో కొనసాగిన శారీరక సంబంధాన్ని అత్యాచారంగా చూడలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు పెళ్లి చేసుకుంటానని హామీతో అత్యాచారానికి పాల్పడ్డినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొరాదాబాద్‌కు చెందిన శ్రేయ్ గుప్తాపై ఉణ్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను జస్టిస్ అనీశ్‌కుమార్ గుప్తా రద్దు చేశారు.
తన భర్త మరణించిన తర్వాత వివాహ చేసుకుంటానని దగ్గరైన శ్రేయ్ గుప్తా.. శారీరక సంబంధం పెట్టుకున్నాడని మొరాదాబాద్‌కు చెందిన ఓ మహిళ..ఆరేళ్ల కిందట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గుప్తా తనను మోసం చేసి మరో మహిళతో నిశ్చితార్థం చేసుకున్నాడని ఆమె పేర్కొంది. అంతేకాదు, తాము ఇద్దరమూ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి, వాటిని బయటపెట్టకుండా ఉండాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఆమె ఆరోపించింది. దీంతో అతడిపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఐపీసీ 376(అత్యాచారం), 386 (దోపిడీ) కింద గుప్తాపై దాఖలు చేసిన 2018 ఆగస్టు 9 నాటి ఛార్జి పిటిషన్‌ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఈ నేపథ్యంలో అతడు తనపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అనీశ్‌కుమార్... ఆమెతో శ్రేయ్ గుప్తాకు గత 12-13 ఏళ్ల నుంచి శారీరక సంబంధం ఉన్నట్టు గమనించారు. భర్త బతికున్నప్పటి నుంచే ఇరువురి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు గుర్తించారు. తన భర్త నడిపిన వ్యాపార సంస్థలో ఉద్యోగి అయిన శ్రేయ్‌ను ఆమె ప్రభావితం చేయడమే కాదు.. వయసులో ఆ మహిళ కంటే చిన్నవాడని పేర్కొంది.
దీంతో నయీమ్ అహమ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటాననే వాగ్దానం ఉల్లంఘించిన ప్రతి వ్యక్తిపై సెక్షన్ 376 ప్రకారం అత్యాచారానికి పాల్పడ్డారని విచారణ జరపడం మూర్ఖత్వమని పునరుద్ఘాటించారు. ఫిర్యాదుదారు చేసిన అత్యాచారం లేదా దోపిడీ ఆరోపణలు చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని కేసును కొట్టివేశారు.