కర్ణాటకలోని మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ - ముడా కుంభకోణంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ముడా ఛైర్మన్ కే మరిగౌడ అర్ధాంతరంగా రాజీనామా చేయడం ప్రస్తుతం కన్నడనాట పెను దుమారం రేపుతోంది. ఓ వైపు ఈ ముడా భూముల కుంభకోణం కేసులో విచారణ జరుగుతుండగా.. ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ముడా ఛైర్మన్ రాజీనామా చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తాను ఆరోగ్యపరమైన కారణాలతో ముడా ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు కే మరిగౌడ మీడియాకు వెల్లడించారు. తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా ఉన్న కే మరిగౌడ.. హఠాత్తుగా రాజీనామా చేయడం.. ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది.
అయితే ముడా కుంభకోణంలో ఓ పక్క విచారణ జరుగుతున్న వేళ.. ఛైర్మన్ పదవికి కే మరిగౌడ రాజీనామా సంచలనంగా మారింది. సీఎం సిద్ధరామయ్యకు కే మరిగౌడ అత్యంత సన్నిహితుడని పేరుండగా.. అతడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత నెలలో కారులో బెంగళూరుకు వెళ్తుండగా.. మరిగౌడ తీవ్ర అస్వస్థతకు గురికాగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరిగి మైసూరుకు తరలించారు. తనకు ఇప్పటికే రెండుసార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని.. ఇంకా ఉద్యోగం చేయలేక అనారోగ్యం కారణంగానే రాజీనామా చేసినట్లు మరిగౌడ మీడియాకు వెల్లడించారు.
ఇక ముడా భూముల కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే సిద్ధరామయ్యతోపాటు ఈ కుంభకోణంలో కే మరిగౌడ ప్రమేయం కూడా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో ప్రతిపక్షాలు సిద్ధరామయ్య, మరిగౌడపై తీవ్ర ఆరోపణలు చేశాయి. ఇప్పటికే ఈ ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యపై పలు కేసులు నమోదయ్యాయి. ఇక సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ.. ఇప్పటికే తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేశారు. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంపై.. సీఎం హైకోర్టుకు వెళ్లగా.. అక్కడా ఎదురుదెబ్బ తగిలింది.