ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసి.. మనం ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటూ ఉంటాం. మన పరిధిలో ఉన్న సమస్యలను గెలిచిన ప్రజా ప్రతినిధులకు చెప్పుకుని.. వాటిని పరిష్కరించేలా చూసుకుంటాం. సమస్యలు అంటే రోడ్లు, తాగునీరు, పక్కా ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇలా ఎన్నో సమస్యలను చెప్పుకుని.. వాటిని సాధించుకునేలా చూస్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం.. తన నియోజకవర్గ ఎమ్మెల్యే వద్దకు విచిత్రమైన కోరికతో వచ్చి చెప్పుకున్నాడు. తనకు వయసు మీద పడుతోందని.. ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని తన ఆవేదనను వెళ్లగక్కాడు. అంతటితో ఆగకుండా ఎవరైనా అమ్మాయిని చూసి తనకు పెళ్లి కూడా చేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నాడు. పైగా తాను ఎన్నికల్లో ఆయనకే ఓటు వేశానని.. అందుకే తనకు పెళ్లి చేయాలని కోరాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని చర్ఖారీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్‌కు.. ఈ విచిత్రమైన అనుభవం ఎదురైంది. నియోజకవర్గ పర్యటనలో భాగంగా కారులో వెళ్తున్న ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్.. మహోబా ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు ఆగారు. ఈ సందర్భంగా అక్కడ ఎమ్మెల్యే ఉన్నారని గమనించిన అఖిలేంద్ర ఖరే అనే వ్యక్తి.. తాను చేస్తున్న పనిని వదిలిపెట్టి ఎమ్మెల్యే కారు వద్దకు పరిగెత్తాడు. పరుగు పరుగున వచ్చిన అఖిలేంద్ర ఖరేను చూసిన ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్.. ఏం కావాలని అడిగారు. దానికి ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని ఎమ్మెల్యే షాక్ అయ్యారు.
తన వయసు 44 ఏళ్లు అని తెలిపిన అఖిలేంద్ర ఖరే.. ఇంకా పెళ్లి కాలేదని ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తనకు ఎవరైనా అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్‌కు విజ్ఞప్తి చేశాడు. అది విని కాస్త ఆశ్చర్యపోయిన ఎమ్మెల్యే.. పెళ్లి కుమార్తెను చూడాలని తననే ఎందుకు అడుగుతున్నావని అఖిలేంద్ర ఖరేను ప్రశ్నించారు. అయితే అందుకు బదులు ఇచ్చిన అఖిలేంద్ర ఖరే.. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు ఆయనకే వేసినట్లు తెలిపాడు. తాను ఓటు వేసి గెలిపించినందుకు గానూ.. తనకు ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని కోరాడు.
మొదట అది విని కాస్త ఆశ్చర్యపోయిన ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ రాజ్‌పూత్.. ఎలాంటి అమ్మాయి కావాలని అఖిలేంద్ర ఖరేను అడిగారు. దానికి బదులు ఇచ్చిన అఖిలేంద్ర ఖరే.. కొన్ని వర్గాలకు చెందిన మహిళలు వద్దని పేర్కొన్నాడు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే.. ఎవరి పట్లా కుల వివక్ష చూపకూడదని సూచించారు. దేవుడు ఎవరితో పెళ్లి రాసిపెడితే వారితోనే వివాహం జరుగుతుందని సమాధానం ఇచ్చారు. అయితే అఖిలేంద్ర ఖరే పెళ్లి త్వరగా కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్న ఎమ్మెల్యే.. తనకు ఓటేసిందుకు గానూ.. తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఎంత జీతం వస్తుందని ఎమ్మెల్యే.. అఖిలేంద్ర ఖరేను ప్రశ్నించగా.. నెలకు రూ.6 వేల జీతం వస్తుందని.. తనకు 13 బిగాల భూమి కూడా ఉందని వివరించాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్, అఖిలేంద్ర ఖరే మధ్య జరిగిన ఆ సంభాషణను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.