భీకరస్థాయిలో విరుచుకుపడుతున్న ఆర్కిటిక్ చలి దెబ్బకు అమెరికాలో లక్షలాది ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సుమారు తొమ్మిది కోట్ల మంది పై ఈ హిమపాతం ప్రభావం చూపిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 53 డిగ్రీల వరకు పడిపోయాయి. ఆర్కిటిక్ గాలులు బలంగా విస్తుండడంతో ఇల్లినాయిస్, మిచిగాన్, విస్కాన్సిన్, షికాగో, డెట్రాయిట్ 33 డిగ్రీల నుంచి 26 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రైళ్ల రాకపోకల కోసం పట్టాలపై మంటలు కొనసాగిస్తున్నారు. నిరాశ్రయులను ఆదుకునేందుకు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు తెరిచారు. చరిత్ర తిరగరాసే విధంగా హిమపాతం నమోదు కావచ్చని అంటున్నారు. ప్రమాదకర స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో చికాగో పరిసర ప్రాంతాలలో సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మిన్నపోలీసు నగరంలో 28 డిగ్రీలకు పడిపోయిందని జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
మిన్నసోటాతో పాటు నార్త్ డకోటా చుట్టు పక్కాల ప్రాంతాలలో చలి గాలుల తీవ్రత అధికంగా ఉంది. చలిగాలుల తీవ్రతకు ప్రజలు పూర్తిగా ఉన్ని దుస్తులు కప్పేసుకుంటున్నారు. ఇంట్లో కూడా ధరించి పనులు చేసుకుంటున్నారు. దారి కనిపించక పెన్నసెల్వియాలో వాహన ప్రమాదాలు జరిగాయి. గ్యారెజీలో ఒక వాహనంలో వ్యక్తి చలికి అలాగే గడ్డకట్టుకునిపోయాడు.
దీంతో ఇళ్లలోనే ఉండిపోవాలని చాలా సంస్థలు తమ ఉద్యోగులకు సమాచారమిచ్చాయి. పలువురు తమ ఇళ్ల నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు, వ్యాపార, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఇప్పటికే 2000కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఒక్క చికాగో విమానాశ్రయం నుంచే ఒక వేయి విమానాల రాకపోకలను నిలిపివేశారు. 12 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. గేదెలు, ఆవులు, మూగ జీవాలను కాపాడుకోవడం కోసం యజమానులు నానా తంటాలు పడుతున్నారు.