బెంగళూరు: సంక్రాంతి వేళ టమోట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అసలే టమోట ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో జనానికి అర్థకం కావడం కష్టం. నిత్యం కూరలు వండుకునేందుకు అవసరమైన టమాట ఐదుపదులకు చేరుకుంది. డిసెంబరు రెండోవారం దాకా పది రూపాయలకే రెండు నుంచి మూడు కిలోల ధర పలికిన టమోటా ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. నాలుగైదు రోజులుగా టమోటా కేజీ 50 రూపాయలకు చేరింది. రానున్న రోజుల్లో 100 రూపాయలు పలికే అవకాశం లేకపోలేదనిపిస్తోంది.
కర్ణాటక, మహారాష్ట్రలో పండించే టమోటా రెండు రాష్ట్రాలతోపాటు దాదాపు దక్షిణాదికి ఎగుమతి అయ్యేది. రెండు రాష్ట్రాల్లోనూ కరువు ప్రభావం ఉండడంతో టమాట దిగుబడి తగ్గిపోయింది. బెంగళూరు మార్కెట్కు సాధారణంగా చిక్కబళ్ళాపుర, కోలారు జిల్లాలనుంచి దిగుమతి అవుతుంది. రెండు జిల్లాల్లోనూ కరువు ప్రభావంతో పంట తగ్గినట్టు కోలారు రైతులు వాపోతున్నా రు. ప్రస్తుతం చిక్కబళ్ళాపుర, కోలారు జిల్లాల్లో డిమాండ్ నేపథ్యంలో నీటిఆధారం ఉన్న ప్రాం తాలలో సాగుకు సిద్ధమైనా పంట చేతికి వచ్చేసరికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. టమోటాతోపాటు ఇతర కూరగాయల ధరలు పది రోజుల్లో పెరిగినట్లు సమాచారం.