-రానురాను బడ్జెట్‌లను అపహాస్యం చేస్తున్నారు
-ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ రఘువీరారెడ్డి
విజయవాడ నుంచి ప్రత్యేక ప్రతినిధి: మూడు బడ్జెట్‌లలో చేసినట్లే 201718 బడ్జెట్‌ను కేటాయింపుల్లో అంకెలు ఘనంగా చూపించడమేగానీ ఖర్చు చేయడానికి కాదు అన్నట్లు బడ్జెట్‌లను చంద్రబాబు ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నదని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఓ ప్రకటనలో ఆరోపించారు. గత బడ్జెట్‌లలో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయించిన నిధులలో 30శాతం కూడా ఖర్చుచేయలేదన్నారు. రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్‌లోనూ అన్యాయం చేశారని, 3.600కోట్లు వడ్డీకి కూడా సరిపోవన్నారు. బేషరతు రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన చంద్రబాబు రాష్ర్టంలో 85 వేల కోట్లు రుణాలు ఉన్నట్లు లెక్క తేల్చారని, కోటయ్య కమిటీ వేసి 24 వేల కోట్లకు వాటిని కుదించారని, అదీ 5 సంవత్సరాల్లో హామీ నెరవేరుస్తామన్నారని చెప్పారు. గత మూడుబడ్జెట్‌లలో 8,600కోట్లు కేటాయించగా ఇప్పుడు 201718 బడ్జెట్‌లో కేవలం 3,600 కోట్లు కేటాయించారని, మొత్తంగా కలిపితే 12,200కోట్లు. అంటే చంద్రబాబు కుదించిన 24 వేలకోట్లకు కూడా రైతు రుణమాఫీ చేయడంలేదని బడ్జెట్ కేటాయింపులను బట్టి అర్ధమవుతుందన్నారు. డ్వాక్రా గ్రూపులకు రూ.1,600 కోట్లు క్యాపిటల్ ఇన్‌ప్యూజన్ పేరుతో కేటాయించారని, డ్వాక్రా రుణాల మాఫీకూడా లేనట్లేనని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయింపులు చూపిస్తున్నారు...ఖర్చులు చేయడంలేదన్నారు. ఈ బడ్జెట్‌లో ఎస్సీ,ఎస్టీలకు ఉపప్రణాళిక చట్టం ప్రకారం లెక్కల్లో శాతాన్ని చూపించారని, కానీ గత మూడు బడ్జెట్‌లలో ఖర్చుల అనుభవం చూస్తుంటే కనీసం 30 నుంచి 40 శాతం నిధులు ఖర్చులు చేయడంలేదన్నారు. కొన్ని నిధులను దారిమళ్ళిస్తున్నారు కనుక లెక్కలను చూపి ప్రభుత్వం బలహీనవర్గాలను మాయచేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్దిక సాయం పేరిట 500కోట్లు కేటాయింపులో ఒక్కొక్కరికి రూ.100రూ కూడా రావన్నారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు నెలకు ఒక్కక్కరికీ 2వేల రూపాయలు నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చి ఈబడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి అనకుండా ఆర్ధికసాయానికి రూ.500కోట్లు అంటూ ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు కనీసం 100రూకూడా రావని తేల్చారు. ఇంటికో ఉద్యోగం హామీ కూడా మోసమేనని తేలిందని రఘువీరారెడ్డి దుయ్యబట్టారు.