ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి తాను డబ్బులు తీసుకున్నానని, పార్టీకి వ్యతిరేకంగా ఓటేశాననే ఆరోపణలను తాడేపల్లి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి కొట్టిపారేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీదేవి మాట్లాడారు.
మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి ఎక్కడ.. అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీదేవి అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అజ్ఞాతంలోకి వెళ్లడానికి తానేమైనా గ్యాంగ్ స్టర్ నా అని ప్రశ్నించారు. తన ఆఫీసుపై వైసీపీ గుండాలు దాడి చేసిన విషయం అందరికీ తెలుసని, తన ఆఫీసులోని కుర్చీలో స్వేచ్ఛగా కూర్చునే వీలులేకుండా చేశారని మండిపడ్డారు.
డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్నలాగా డాక్టర్ శ్రీదేవి కూడా చనిపోకూడదనే ఉద్దేశంతోనే కొన్నిరోజులు బయట కనిపించలేదని వివరించారు. అయితే, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, అదేమీ సహారా ఎడారి కాదని చెప్పారు. తాను సమాజంలో బాధ్యతగల డాక్టర్ నని, హైదరాబాద్ లోని టాప్ 10 డాక్టర్లలో తన పేరు ఉంటుందని ఆమె వివరించారు. వైద్యురాలిగా తన సేవలను గుర్తించి తాడేపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముఖ్యమంత్రి జగన్ తనకు అవకాశం ఇచ్చారని శ్రీదేవి చెప్పారు.
అయితే, ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజు నుంచే తనపై పార్టీలో కుట్ర మొదలుపెట్టారని శ్రీదేవి ఆరోపించారు. ముక్కుసూటిగా ఉండే తనను ఎలాగైనా రాజధాని ప్రాంతం నుంచి తప్పించాలని పార్టీలోనే కొంతమంది కుట్రలు పన్నారని చెప్పారు. ప్రజాసేవ కోసం వచ్చిన తనను తన్ని రోడ్డుపై పడేశారని, తనను పిచ్చికుక్కతో సమానంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపైనా శ్రీదేవి స్పందించారు. ఎమ్మెల్సీకి జీతం ఎంత ఉంటుందని విలేకరులను ప్రశ్నించారు.. లక్ష, లక్షన్నర జీతం వచ్చే ఎమ్మెల్సీకి రూ.కోట్లలో డబ్బులు ఎవరు ఇస్తారని అడిగారు. తాను ఎవరికి ఓటేశానో తనపై ఆరోపణలు చేస్తున్న వారికి ఎలా తెలుసని, తన కోసం స్పెషల్ గా పోలింగ్ బూత్ లో సీసీటీవీ కమెరాలు ఏవైనా పెట్టారా అని అడిగారు. రహస్యంగా జరిగే ఓటింగ్ లో ఎవరు ఎవరికి ఓటేశారో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తనపైనే క్రాస్ ఓటింగ్ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.