ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంకు మొండి బాకీల కోసం అధిక కేటాయింపులు చేయడంతో భారీ నష్టాలు చవి చూసింది. 2017-18 జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఏకంగా రూ.4,859.77 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.214 కోట్లు, క్రితం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.126 కోట్ల చొప్పున లాభాలు నమోదు చేసింది. గత క్యూ4లో నికర వడ్డీపై ఆదాయం (ఎన్ఐఐ) 10.3 శాతం పెరిగి రూ.2987 కోట్లకు చేరింది. 2017 ఇదే క్యూ4లో రూ.2,709 కోట్ల ఎన్ఐఐ నమోదయ్యింది. ఈ సమయంలో రూ.2,708.74 కోట్లు మొండి బాకీల కోసం కేటాయింపులు చేయగా, 2018 మార్చి త్రైమాసికంలో రూ.9,075.04 కోట్ల కేటాయింపులు జరిపింది. ఈ భారం మూడు రెట్లు పెరగడంతో బ్యాంకు భారీ నష్టాల పాలయ్యింది. బ్యాంకు నికర నిరర్ధక ఆస్తులు 7.48 శాతానికి పెరిగాయి. 2016-17 ఇదే క్యూ4 నాటికి 6.78 శాతంగా ఉన్నాయి. క్రితం క్యూలో బ్యాంకు దేశీయ రుణాలు 12 శాతం పెరిగి రూ.3.53 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రిటైల్ రుణాల్లో 30 శాతం వృద్ధి, ఎంఎస్ఇ రుణాల్లో 22 శాతం, వ్యక్తిగత రుణాల్లో 56 శాతం చొప్పున పెరుగుదల చోటు చేసుకుంది. మొత్తం డిపాజిట్లు 7 శాతం పెరిగి రూ.4.86 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
2017-18లో...
క్రితం ఆర్ధిక సంవత్సరం (2017-18)లో కెనరా బ్యాంకు రూ.4,222.24 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. ఇంతక్రితం 2016-17లో రూ.1121.92 కోట్ల నికర లాభాలు సాధించింది. ఈ ఏడాదిలో రూ.9,872 కోట్లుగా ఉన్న నికర వడ్డీపై ఆదాయం (ఎన్ఐఐ) 2017-18లో 23 శాతం వృద్ధితో రూ.12,163 కోట్లకు చేరింది. ఇదే సమయంలో వడ్డీయేతర ఆదాయం 8 శాతం తగ్గి రూ.7554 కోట్ల నుంచి రూ.6,943 కోట్లకు పడిపోయింది. శుక్రవారం బిఎస్ఇలో కెనరా బ్యాంకు షేర్ 0.92 శాతం తగ్గి రూ.246.35 వద్ద ముగిసింది.