మండే ఎండల వల్ల కలిగే దాహార్తికి రుచికరంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారా ? అయితే వెంటనే ఈ రెసిపీని ప్రయత్నించండి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించటమే కాక ఎంతో టేస్టీ గా ఉంటుంది. పిల్లల్లకు, పెద్దలకు అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుంది. ఇంకెందుకాలస్యం కొబ్బరి లస్సీ ఎలా చెయ్యాలో తెలుసుకుందామా...
కావాల్సిన పదార్థాలు: పంచదార - 3 స్పూన్లు, కొబ్బరినీళ్లు, ఐస్ క్యూబ్స్, కొబ్బరి బోండం - 1, తాజా పెరుగు - 1 కప్పు , రోజ్ వాటర్ - 1 స్పూన్
తయారీ విధానం: ముందుగా ఒక లేత కొబ్బరి బోండాన్ని తీసుకుని, అందులోని నీటిని తీసేసి, ఆ బోండాన్ని రెండు సగాలుగా చెయ్యండి. అందులో ఉండే పల్చని కొబ్బరి గుజ్జును ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడొక జ్యూసర్ ను తీసుకుని అందులో 6 ఐస్ క్యూబ్స్, 3 స్పూన్ల పంచదార, కొబ్బరి బోండంలోని గుజ్జు,కొబ్బరి నీళ్లు వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడదే జార్ లో స్వచ్ఛమైన పెరుగును ఒక కప్పు, ఒక స్పూన్ రోజ్ వాటర్ ను వేసుకుని తిరిగి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని చల్లచల్లని కొబ్బరిలస్సీని తాగి ఎంజాయ్ చెయ్యాలి.