ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రికార్డు కు 71 పరుగుల దూరంలో విరాట్ కోహ్లి

national |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 03:39 PM

ఐపీఎల్ 2021లో సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు దిగే సమయంలో ఓ అరుదైన రికార్డు అతన్ని ఊరించబోతోంది. ఇది ఇప్పటి వరకూ ఏ ఇండియన్ బ్యాట్స్‌మన్‌కూ సాధ్యం కాని రికార్డు. అలాంటి రికార్డుకు విరాట్ కేవలం 71 పరుగుల దూరంలో ఉన్నాడు. అతడు ఈ పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో 10000 పరుగులు చేసిన తొలి ఇండియన్‌గా నిలుస్తాడు.


ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వాళ్లలో ఐదో బ్యాట్స్‌మన్ అవుతాడు. ఇండియన్ టీమ్‌తోపాటు దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున మొత్తం 311 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 9929 పరుగులు చేశాడు. 133.95 స్ట్రైక్ రేట్ కాగా.. అందులో 5 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 446 మ్యాచ్‌లలో 14,261 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. అతడు 22 సెంచరీలు, 87 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఇక రెండో స్థానంలో వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ (561 మ్యాచ్‌లు, 11,159 పరుగులు), మూడో స్థానంలో పాక్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ (436 మ్యాచ్‌లలో 10,808 పరుగులు), నాలుగో స్థానంలో ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ (304 మ్యాచ్‌లలో 10,017 పరుగులు) ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com