ఓ 11 ఏళ్ల బాలిక బాగా చదువుకుని కలెక్టర్ కావాలనుకుంది. అయితే కొంతకాలంగా ఆ బాలిక బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతోంది. దీంతో ఆమె కలను నిజం చేయాలని ఒక్కరోజు ఆ చిన్నారిని కలెక్టర్ చేసేందుకు అధికారులు అంగీకరించారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని గాంధీనగర్ కు చెందిన ఫ్లోరా అసోడియా 7వ తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. గత నెలలో ఆ బాలికకు ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం మెరుగవుతుందనుకున్న సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఇదే సమయంలో మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు చిన్నారి కలను తెలుసుకున్నారు. చొరవ తీసుకుని చిన్నారి గురించి అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ సందీప్ సాంగ్లేకు వివరించారు. దీంతో చిన్నారిని ఒక్కరోజు కలెక్టర్ చేసేందుకు అక్కడి పాలనాధికారి అంగీకరించారు.
సెప్టెంబరు 25న చిన్నారి పుట్టినరోజు ఉండటంతో ముందుగానే వేడుకలను కూడా జరిపారు. ఫ్లోరా చదువులో ముందుండేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. కలెక్టర్ అవ్వాలనుకున్న తమ కూతురి కలను నెరవేర్చినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఫ్లోరా అసోడియా విషయంలో చొరవ చూపిన మేక్ ఏ విష్ ఫౌండేషన్, అహ్మదాబాద్ కలెక్టర్ సందీప్ సాంగ్లేను స్థానికులు అభినందిస్తున్నారు.