అల్‌ఖైదా ఇకా అమెరికాపై దాడిచేస్తుందేమో? : నిఘా వర్గాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 06:56 PM
 

ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు మారడంతో అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ మళ్ళీ బలం పుంజుకుంటుందని అమెరికా నిఘా అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే ఒకట్రెండు సంవత్సరాల్లో మరోసారి అమెరికాపై అల్‌ఖైదా ఉగ్ర దాడి జరగవచ్చునని భావిస్తున్నారు. అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.


అమెరికాకు ముప్పు తెచ్చేందుకు అల్‌ఖైదాకు ఒకటి లేదా రెండు సంవత్సరాలు పట్టవచ్చునని లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్‌ తెలిపారు. ఆయన మంగళవారం నిఘా సంబంధిత సమావేశంలో మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌ సమాచారం తెలుసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ పనికే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. చాలా కొరతగా ఉన్న వనరులను సమతుల్యం చేయడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.


ఆఫ్ఘనిస్థాన్‌లో అల్‌ఖైదా తిరిగి కోలుకుంటోందని సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ కోహెన్ కూడా అంగీకరించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని సమకూర్చుకోవడానికి అల్‌ఖైదాకు రెండేళ్ళు పట్టవచ్చునని డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ సెనేట్ కమిటీకి జూన్‌లో తెలిపారు. 2001 సెప్టెంబరు 11న అమెరికాపై అల్‌ఖైదా ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల అనంతరం అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా అంతం చేసింది.