ఐఏఎస్‌ రోహిణి సింధూరికి కోర్టు హెచ్చరిక

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 01:07 PM
 

మైసూరులోని సర్వే నెంబరు 4కు సంబంధించి కురుబరహళ్లి, గౌడహళ్లి, ఆలనహళ్లి భూవివాదంపై కోర్టు ఉల్లంఘనలతో ఐఏఎస్‌ అధికారి రోహిణిసింధూరికి క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఆగస్టు 13లోగా సంబంధిత వ్యక్తుల పేరిట భూములు మార్చకుంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. సర్వే నెంబరు 4 పరిధిలోని భూముల వివాదాన్ని పరిష్కరించి నివాసుల సమస్యను వెంటనే తీర్చాలని హైకోర్టు సూచించింది. కోర్టు ఉత్తర్వులు పాటించలేదని భూముల యజమానులు ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరిపై క్రిమినల్‌ కేసు రూపంలో కోర్టు ఉల్లంఘన పిటీషన్‌ దాఖలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం నేరుగా విచారణకు హాజరు కావాలని రోహిణి సింధూరికి నోటీసు జారీ చేసింది. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రోహిణి సింధూరి విచారణలో పాల్గొన్నారు. ఇదే సందర్భంలో ఆగస్టు 13లోగా వివాదాన్ని పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోహిణి సింధూరితోపాటు తహసీల్దార్‌ రక్షిత్‌లపైనా ధర్మాసనం మండిపడింది.