ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 15, 2021, 10:24 AM

ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల అమలు దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు "జీవో 37"  జారీ చేశారు. ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి 1:40 ఉండేలా తొలుత ఎయిడెడ్‌ పాఠశాలల్లోని టీచర్‌ పోస్టులను రేషనలైజ్‌ చేయాలి. ఇందుకు గాను 2020-21 విద్యా సంవత్సరం పాఠశాల చివరి పనిదినాన్ని " ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏప్రిల్‌ 19, ఉన్నత పాఠశాలలకు ఏప్రిల్‌ 30"  పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య, మంజూరైన పోస్టుల ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను ఎక్కడ అవసరమో గుర్తించి ఆయా పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. జిల్లా పరిధిలోనే ఈ సర్దుబాటు/బదిలీ ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత కూడా పోస్టులు మిగిలితే, అవసరాన్ని బట్టి ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాలు చేపడతారు. ఈ నియామకాలను ఉన్నత పాఠశాలలకు ఆర్‌జేడీలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు డీఈవోలు చేపడతారు.


ఈ ఉత్తర్వులపై పాఠశాల విద్యా డైరెక్టర్‌ వెంటనే చర్యలు చేపట్టి, ప్రక్రియ పూర్తయిన వెంటనే పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే 1994 జనవరి ఒకటో తేదీ నాటి ఉత్తర్వుల్లోని రూల్‌ 10(12)ప్రకారం స్టాఫ్‌ ప్యాట్రన్‌ మేరకు అదనపు ఉపాధ్యాయులను గుర్తించాలి. వారిని అవసరం ఉన్న ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేయాలి. అయితే, ఈ ఉత్తర్వుల ప్రకారం అంత ఈజీగా జరిగేపని కాదని స్పష్టమవుతోంది. దీర్ఘకాలం నుంచి ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాలు నిలిచిపోయాయి. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు-విద్యార్థుల సంఖ్య సమాచారం పక్కాగా లేదు. పిల్లలు ఉన్న చోట్ల టీచర్లు ఉండరు, పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య అవసరానికి మించి ఉంది. దీంతో ఈ ప్రక్రియ ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com