ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ICMR చీఫ్ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Thu, May 13, 2021, 10:01 AM

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి మామూలుగా లేదు. సెకండ్ వేవ్ లో మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. వేగంగా వ్యాపిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. విలయతాండవం చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు దాదాపు రాష్ట్రాలన్నీ ఆంక్షల బాటపట్టాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన ఆంక్షలతో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో లాక్ డౌన్ అవసరం గురించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.


కరోనా పాజిటివిటీ 10 శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్‌ అవసరమని ఐసీఎంఆర్ సూచించింది. వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ.. మహమ్మారి కట్టడికి ఎన్ని రోజులు లాక్‌డౌన్‌ అవసరమనే అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఐసీఎంఆర్‌ చీఫ్‌ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


 


'అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్‌ ఉండాల్సిందే. అక్కడ పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి తగ్గితే ఆంక్షలు సడలించవచ్చు. అలా జరగాలంటే 6 నుంచి 8 వారాల లాక్‌డౌన్‌ అవసరం' అని ఓ ఇంటర్వ్యూలో ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ చెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీ లాక్‌డౌన్‌ను బలరాం భార్గవ ప్రస్తావించారు. అక్కడ 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17 శాతానికి తగ్గిందని.. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను సడలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.


 


బయట ఎక్కువగా తిరిగి కరోనా తెచ్చుకుంటున్నారు..


కరోనా సెకండ్‌ వేవ్‌లో గతంతో పోలిస్తే యువత కొంచెం ఎక్కువగానే అనారోగ్యం పాలవుతున్నారు. ఈ విషయంపై ఐసీఎంఆర్‌ డీజీ బలరామ్‌ భార్గవ స్పందించారు. యువతకు ఎక్కువ సోకడానికి గల రెండు కారణాలను ఆయన వివరించారు. యువత ఎక్కువగా బయట తిరుగుతుండటంతో వారు కరోనాకు లక్ష్యంగా మారుతున్నారని విశ్లేషించారు. దీంతోపాటు దేశంలోని కొత్త వేరియంట్ల ప్రభావం కూడా కారణం అన్నారు. 2020లో వచ్చిన కరోనా ఫస్ట్‌వేవ్‌లో వచ్చిన కేసుల్లో 31శాతం మంది 30 ఏళ్ల లోపు యువత ఉండగా.. ఈ సారి అది 32 శాతానికి చేరిందన్నారు.


 


గోవాలో అత్యధికం..


దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు సరాసరి 21 శాతం ఉన్నట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. దేశంలో ఉన్న 718 జిల్లాల్లో దాదాపు 310 జిల్లాల్లో దేశ పాజిటివిటీ రేటు సరాసరి (21%) కంటే ఎక్కువగా ఉండగా.. మూడో వంతు జిల్లాల్లో పది శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తొలి స్థానంలో ఉండగా… పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, హరియానా, కర్ణాటక ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివిటీ రేటు దాదాపు 48 శాతం ఉండగా, హరియానాలో 37 శాతంగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌లో పాజిటివిటీ రేటు ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. తెలంగాణలో పాజిటివిటీ రేటు 9 శాతం .. ఆంధ్రాలో 23 శాతం వరకు ఉంది.


 


ఈ నేపథ్యంలో పాజిటివిటీ రేటు 10 శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాలు లాక్‌డౌన్‌ విధించాలని జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సూచిస్తోంది. ఈ విషయాన్ని ఏప్రిల్‌ 15న జరిగిన సమావేశంలో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ చర్చించినట్లు సమాచారం. ఇందులో భాగంగా గత నెల 15న కేంద్రానికి కొన్ని సిఫార్సులు చేసింది. అనంతరం, ఏప్రిల్‌ 20న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… వైరస్‌ కట్టడికి మైక్రో కంటైన్మెంట్‌ జోన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా పోరులో లాక్‌డౌన్‌ చివరి అస్త్రం కావాలని అభిప్రాయపడ్డారు. ఆంక్షల అమలుకు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడంతో వైరస్‌ తీవ్రత ఉన్న రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com