ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే మహిళతో నాలుగు సార్లు పెళ్లి

international |  Suryaa Desk  | Published : Thu, Apr 15, 2021, 10:30 AM

ఓ వ్యక్తి ఓ మహిళను నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మూడు సార్లు విడాకులు ఇచ్చి.. మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. అతడు సెలవుల కోసమే ఇలా చేశాడని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ ఘటన తైవాన్ దేశంలోని తైపై నగరంలో జరిగింది...తైవాన్ దేశంలోని తైపై నగరంలో ఓ వ్యక్తి బ్యాంకులో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. ఆ దేశ లేబర్ చట్టాల ప్రకారం ఎవరైనా ఉద్యోగి పెళ్లి చేసుకుంటే 8 రోజుల వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాల్సి ఉంటుంది. అందుకే అతడు తన సెలవుల కోసం ఒకే మహిళను నాలుగుసార్లు పెళ్లి చేసుకున్నాడు. గతేడాది ఏప్రిల్ 6వ తేదీన అతడు ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం 8 రోజుల సెలవు కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత తన భార్యకు అతడు విడాకులు ఇచ్చాడు. మళ్లీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇలా నాలుగు సార్లు ఆమెను పెళ్లాడాడు. మూడు సార్లు విడాకులు ఇచ్చాడు. నిబంధనల ప్రకారం 32 రోజుల పాటు అతడు సెలవులకు దరఖాస్తు చేశాడు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన బ్యాంకు అధికారులు అతడికి వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయడం కుదరదని చెప్పారు. దీంతో ఆ క్లర్క్ లేబర్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసులో ఓ పిటిషన్ ను దాఖలు చేశాడు. తీర్పు అతడికే అనుకూలంగా వచ్చింది. బ్యాంకు అధికారులు లేబర్ చట్టాలను ఉల్లంఘించారంటూ గతేడాది అక్టోబర్ నెలలో రూ.52,800 జరిమానాను విధించారు. బ్యాంకు అధికారులు ఈ తీర్పును సవాల్ చేస్తూ బైషీ లేబర్ బ్యూరీలో పిటిషన్ దాఖలు చేశారు. సెలవుల కోసం ఆ క్లర్క్ నీతిమాలిన పనికి చేసినప్పటికీ నిబంధనలను మాత్రం అతడు అతిక్రమించలేదని బైషీ లేబర్ బ్యూరో తేల్చిచెప్పింది. బ్యాంకు అధికారులు అతడికి నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా కూడా సెలవులు పొందొచ్చా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com