ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో మరో కొత్త వైరస్

international |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 01:27 PM

ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతున్న వేళ చైనా పరిశోధకులు మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇటీవల చైనా శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనంలో మహమ్మారిగా మారే ఓ కొత్త రకమైన స్వైన్ ఫ్లూ వైరస్ ను కనుగొన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఆధారంగా తెలుస్తోంది. ఈ వైరస్ కు జీ4 H1N1 అని పేరు పెట్టారు.2009లోనే బయటపడ్డ ఈ వైరస్ అప్పుడే ప్రపంచాన్ని భయపెట్టింది. సీజనల్‌గా వ్యాప్తి చెందే హెచ్1ఎన్1 రకం వైరస్ 2009లో ప్రపంచవ్యాప్తంగా విజృంభించి 2,85,000 మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఇప్పుడు ఈ వైరస్ తన రూపాన్ని మార్చుకొని విజృంభిస్తోంది. అందుకే శాస్తవేత్తలు దీనికి జీ4 H1N1 అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వైరస్ పందుల్లో వస్తుంది. కానీ అది మనుషులకు కూడా వ్యాపించవచ్చు. ఈ వైరస్ తన స్వరూపాన్ని మార్చుకోగలదని, ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాపిస్తుందని, మహమ్మారిగా కూడా మారవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.పందుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించే ప్రమాదమున్నందున ప్రజలు అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ వైరస్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి కూడా మనిషి శరీరంలో తక్కువగా ఉండే అవకాశం ఉంది. G4 H1N1 అనే ఈ కొత్త వైరస్ మనుషుల శ్వాస నాళంలో పెరుగుతుందని, ఇది తన సంఖ్యను వృద్ధి చేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి జంతువులతో పోలిస్తే, మనుషులకు దగ్గరగా ఉండే పెంపుడు జంతువులు ఈ వైరస్‌లకు ప్రధాన కారణం అని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వెటర్నరీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ జేమ్స్ వుడ్స్ అన్నారు.ఇప్పటికే పందుల పరిశ్రమలో పని చేసే వారిలో పలువురికి ఈ వైరస్ సోకింది. దీనికి ప్రస్తుతం ఉన్న ఫ్లూ వ్యాక్సిన్ పని చేయదని శాస్త్రవేత్తలు తేల్చారు. 2016 నుంచి 2018 మధ్య‌ పందులను పెంచే రైతుల్లో 10 శాతం మందికి, సాధారణ జనాభాలో 4.4 శాతం మందికి జీ4 వైరస్ సోకినట్లు యాంటీ బాడీ టెస్టుల్లో నిర్ధారించారు. ఈ కేసులు పందుల పెంపకం ఎక్కువ‌గా ఉండే హీబే, షాండోంగ్ ప్రావిన్సుల్లోనే ఉన్న‌ట్లు గుర్తించారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారిలో నిర్వహించిన పరీక్షల్లో 20.5 శాతం మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.ఈ వైరస్ పందుల నుంచి మనుషులకు సోకిందని,కానీ మనుషుల నుంచి మనుషులకు సోకిన దాఖలాలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా వైరస్ లా కాకుండా జీ4 వైరస్ ను ఆదిలోనే కట్టడి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు తెలిపింది. దీని పై చైనా స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది. ఫెర్రెట్స్‌తో సహా వివిధ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు ఫ్లూ సమయంలో మనుషులు అనుభవించే జ్వరం, దగ్గు, తుమ్ములు మాదిరి లక్షణాలే ఈ వైరస్ సోకిన వారిలో ఉన్నట్లు గమనించారు. మహమ్మారిగా మారే అవకాశం ఉన్న ఈ వైరస్ పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com