ఐసీసీ చైర్మన్‌ రేసులో కామెరూన్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 30, 2020, 11:55 AM
 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్‌ పదవి కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) మాజీ అధ్యక్షుడు డేవ్‌ కామెరూన్‌ఎన్నికల బరిలో దిగనున్నాడు. ప్రస్తుత చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ముగుస్తుండడంతో ఐసీసీ కొత్త బాస్‌ కోసం సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌.. కామెరూన్‌ అభ్యర్థిత్వాన్ని ప్రతిపా దిస్తూ మనోహర్‌కు లేఖ రాసింది. 2013 నుంచి 2019 వరకు సీడబ్ల్యూఐ ప్రెసిడెంట్‌గా పనిచేసిన కామెరూన్‌ బరిలో నిలవాలంటే రెండు నామినేషన్లు అవసరం. మరి.. విండీస్‌ బోర్డు నుంచి అతనికి మద్దతు లభిస్తుందో లేదో చూడాలి. ప్రస్తుత సీడబ్ల్యూఐ అధ్యక్షుడు రికీ సెరిట్‌తో కామెరూన్‌కు సంబంధాలు బాగా లేవు. దీంతో ఆయన మద్దతు కామెరూన్ లభిస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. పైగా ఈ ఇద్దరూ ఓసారి బహిరంగంగానే గొడవపడ్డారు


ఇక తనకు ఐసీసీ ఛైర్మన్ పదవి వరిస్తే అమెరికాలో కూడా క్రికెట్‌ను అభివృద్ధి చేస్తానన్నారు. 'ఓవరాల్‌గా క్రికెట్‌ను చూసే దృక్పథాన్నే మార్చాల్సిన అవసరం ఉంది. అగ్రరాజ్యమైన అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచే అవకాశం ఉంది. టెస్ట్, టీ20 వన్డేలు, మెగాటోర్నీల్లో మరిన్ని జట్లను చూడాలని మేం ప్రయత్నిస్తున్నాం. మరింత మంది ఆటగాళ్లను ప్రోత్సహించాలనుకుంటున్నాం'అని తెలిపారు.


కాగా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ కొలిన్‌ గ్రేవ్‌.. ఐసీసీ చైర్మన్‌ రేస్‌లో ముందున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు కూడా వినిపిస్తోంది. కానీ ఈ విషయంలో బీసీసీఐ గానీ, దాదా గానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.