ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ హైవేలో 50 మందికిపైగా మహిళలు మాయం, 50 ఏళ్లుగా వీడని మిస్టరీ!

national |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 04:33 PM

అది హైవే కాదు.. మహిళల పాలిట మృత్యు మార్గం. అటుగా బాలికల నుంచి వృద్ధ మహిళల వరకు.. ఎవరు ప్రయాణించినా తిరిగి ఇంటికి వెళ్లరు. వారిలో కొందరు శవాలై కనిపిస్తారు. లేదా పూర్తిగా కనుమరుగవుతారు. ‘హైవే ఆఫ్ టియర్స్’గా పిలిచే ఈ మార్గం ఉత్తర అమెరికాలోని కెనడాలో ఉంది. ప్రిన్స్ జార్జ్ నుంచి ప్రిన్స్ రుపెర్ట్ వరకు గల 720 కిమీల ఈ హైవేలో జర్నీ మహిళలకు యమ డేంజర్. 1969 నుంచి మహిళలు అపహరణకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం కెనడా పోలీసులు అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గత 50 ఏళ్లలో అక్కడ 50 పైగా హత్యలు, అపహరణలు చోటుచేసుకున్నాయి. బాధితులంతా మహిళలు, యువతులు, బాలికలే. ఈ హైవే పొడవునా చిన్నచిన్న ఊర్లు ఉంటాయి. అక్కడ నివసించేవారు చాలా పేదవారు.నగరాల్లోకి వెళ్లేందుకు వాహనాలు కూడా ఉండవు. దీంతో అక్కడి ప్రజలు హైవే పైకి వచ్చి వాహనాలను లిఫ్ట్ అడిగి ఎక్కుతారు. అలా ప్రయాణించిన మహిళల్లో చాలామంది అపహరణకు గురయ్యారు. దీంతో ఆ హైవేకి ‘హైవే ఆఫ్ టియర్స్’ (కన్నీటి రహదారి) అని పేరు పెట్టారు. ఈ నేరాలను దృష్టిలో పెట్టుకుని ఆ మార్గంలో మహిళలు ఎవరినీ లిఫ్ట్ అడిగి కార్లు ఎక్కవద్దని పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేగాక, అటుగా వాహనాల్లో వెళ్లే మహిళలు.. ఎక్కడా ఆగకుండా ప్రయాణించాలని సూచిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే చేరుకోడానికి హెలికాప్టర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. అయినా, మహిళలు అపహరణకు గురవుతూనే ఉన్నారు. ఆ హైవే పొడవునా జనసంచారం తక్కువగా ఉండటంతో సిరియల్ కిల్లర్లు దారి కాచి ఒంటరిగా ప్రయాణించే మహిళలను అపహరిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటివరకు ఒక్క హంతకుడు కూడా అక్కడ పట్టుబడలేదు. పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా అనుమానస్పదంగా ఒక్క వ్యక్తి కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ మార్గంలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసింది. ఆ మార్గంలో ప్రజా రవాణా బస్సులను అందుబాటులోకి తెచ్చి, మహిళలు వాటిలో మాత్రమే ప్రయాణించాలనే నిబంధన పెట్టింది. ఇప్పటికీ ఆ మిస్టరీ అంతుచిక్కకుండానే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com