ఏపీ సీఎం జగన్ తో ఈ నెల 9న మధ్యాహ్నం 3 గంటలకు తెలగు సినీ పెద్దలు సమావేశం కానున్నట్లు నిర్మాత సి. కళ్యాణ్ తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశానికి హీరోలు చిరంజీవి, నందమూరి బాలకృష్ణతో సహా టాలీవుడ్‌కు చెందిన ముఖ్యులందరినీ ఆహ్వానించామన్నారు. కానీ జూన్ 10న బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఆయన ఈ సమావేశానికి రావడం లేదని తెలిపారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి చర్చించిన విషయాలు చెబుతామని సి. కళ్యాణ్ చెప్పారు. సీఎం జగన్ తో జరిగే సమావేశంలో కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతి, థియేటర్ల ఓపెన్, తదితర అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సినీ పెద్దలు సమావేశం అయిన విషయం తెలిసిందే. అంతకుముందు చిరంజీవి నివాసంలో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కూడా సినిమా షూటింగ్‌ల అనుమతిపై చర్చించారు. అయితే ఈ సమావేశాలకు తనను ఆహ్వానించలేదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు వివాదస్పద వ్యాఖ్యలు సైతం చేయడంతో టాలీవుడ్లో పెద్ద దుమారం చెలరేగింది. దీంతో ఈ సారి ఏపీ సీఎంతో జరిగే సమావేశంలో ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా అందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.