పెళ్లికూతురుకు కరోనా... 32 మంది క్వారంటైన్ కు తరలింపు

  Written by : Suryaa Desk Updated: Sat, May 23, 2020, 12:36 PM
 

కరోనా మహమ్మారి భారత్ లో వేగంగా విస్తరిస్తోంది. కొన్ని విచిత్రమైన కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మే 19న పెళ్లి చేసుకున్న ఓ జంట కాపురానికి సిద్ధమవుతున్న వేళ... పెళ్లికూతురుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ భోపాల్ సమీపంలోని జట్ ఖేడి ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో, వధూవరుల కుటుంబసభ్యులతో పాటు పెళ్లికి హాజరైన 32 మందిని క్వారంటైన్ కు తరలించారు. రెండు రోజుల క్రితం ఈ వివాహం జరిగింది. లాక్ డౌన్ నిబంధనలకు లోబడే... అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి తంతును ముగించారు. పెళ్లికి ముందు నుంచే యువతి దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. జ్వరం తగ్గడానికి మాత్రలు వేసుకొని ఆమె పెళ్లి పీటలపై కూర్చునట్లు వెల్లడైంది. ఆ తర్వాత జ్వరం కొంచెం ఎక్కువ కావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది.