బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్‌కి వరుసకు సోదరి అయిన నూర్ జెహాన్ (52) క్యాన్సర్ కారణంగా పాకిస్తాన్‌లోని పెషావర్‌లో కన్నుమూసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. నోటి క్యాన్సర్ వలన ఆమె కన్నుమూసిందని నూర్ భర్త ఆసిఫ్ బుర్హాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్ సమీపంలోని మొహల్లా షా వాలి కతాల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. జెహాన్ తండ్రి షారుక్‌కు పినతండ్రి అవుతారు. ఆ రకంగా వారి మధ్య బంధం ఏర్పడింది. షారూఖ్ గతంలో రెండు సార్లు నూర్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో ఆమెతో కలిసి ఫోటోలు దిగారు. నూర్ జెహాన్ మృతి చెందిన నేపథ్యంలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నూర్ జెహాన్ పాకిస్తాన్లో జిల్లా, పట్టణ కౌన్సిలర్‌గా పనిచేశారు. జూలై 2018 సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేసి తరువాత ఉపసంహరించుకున్నారు.