రెండో వన్డేలో ఇండియా-ఏ ఓటమి...

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 05:03 PM
 

హాగ్లీ ఓవల్ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్-ఏ జట్టుతో జరిగిన అనధికార రెండో వన్డేలో ఇండియా-ఏ జట్టు 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో భారత ఆటగాడు కృనాల్ పాండ్యా హాఫ్ సెంచరీ వృథా అయింది. 296 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులకే పరిమితమైంది. భారత జట్టులో ఏ ఒక్కరూ భారీ స్కోరు సాధించలేకపోయారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. న్యూజిలాండ్-ఏ జట్టు ఓపెనర్ జార్జి వర్కర్ 135 పరుగులతో సెంచరీ సాధించగా... కోల్ మెక్కాంచి(56), జేమ్స్ నీషామ్(33 నాటౌట్) ఫరవాలేదనిపించారు. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్ మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా... అక్షర పటేల్, కృనాల్ పాండ్యాలకు తలో వికెట్ లభించింది. అనంతరం చేధనకు దిగిన ఇండియా-ఏ జట్టు ఓపెనర్ పృథ్వీషా వికెట్‌ను మొదటి ఓవర్‌లోనే కోల్పోయింది. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్(37), రుతురాజ్ గైక్వాడ్(17), సూర్యకుమార్ యాదవ్(20) నిరాశపరిచారు. ఇషాన్ కిషన్(44), విజయ్ శంకర్(41) పరుగులతో పోరాడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లు మాత్రం వరుసగా వికెట్లు తీస్తూ భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచారు. చివర్లో కృనాల్ పాండ్యా మెరుపులు మెరిపించినప్పటికీ భారత్ ఓటమిపాలైంది. తాజా విజయంతో మూడు వన్డేల సిరిస్ 1-1తో సమం అయింది. చివరి వన్డే ఆదివారం జరగనుంది.