తొలి టీ20లో భారత్ ఘన విజయం

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 04:34 PM
 

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం విజయం సాధించింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదటగా ఓపెనర్ లోకేశ్ రాహుల్ (56), కెప్టెన్ విరాట్ కోహ్లీ (45) చెలరేగగా.. ఇన్నింగ్స్ చివరలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (58) ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో టీమిండియా భారీ లక్ష్యాన్నిఛేదించింది. కివీస్ బౌలర్లలలో ఇష్ సోధి రెండు వికెట్లు సాధించాడు. 204 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (7) త్వరగానే పెవిలియన్ చేరాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో రాస్ టేలర్ చేతికి చిక్కాడు. ఆపై లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. కోహ్లీ అండతో రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా బౌండరీలు, సిక్సులు బాదుతూ వేగంగా పరుగులు చేసాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. లక్ష్యం పెద్దది కావడంతో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. కోహ్లీతో కలిసి రాహుల్ 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మరోవైపు కోహ్లీ కూడా తన మార్క్ ఆటతో అలరించాడు. పేస్, స్పిన్ బౌలింగ్‌లలో వేగంగా పరుగులు చేసాడు. కొద్దిసేపటికే కోహ్లీ (49) కూడా క్యాచ్ ఔట్ రూపంలో నిష్క్రమించాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రేయాస్ అయ్యర్‌కు జత కలిసిన శివమ్ దూబే (13) ఓ సిక్స్, ఫోర్ కొట్టి కొద్దిగా ఒత్తిడి తగ్గించాడు. అయితే భారీ షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఈ సమయంలో అయ్యర్‌ కివీస్ బౌలర్లపై విరుచుకుపడి వీరవిహారం చేసాడు. బౌండరీలు, సిక్సులు బాదుతూ కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. మనీష్ పాండే (14)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆక్లాండ్ వేదికనే రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన శ్రేయాస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.