ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక ఫలితాలపై మోడీ

national |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 07:33 PM

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు గతవారం జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న బిజెపి 12 సీట్లు గెలుచుకుంది. ఈ ఫలితాలతో బిఎస్ యెడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ సాధించి అధికారంలో ఉండేందుకు అర్హత సంపాదించుకుంది. 2018 ఎన్నికల్లో ఈ 15 స్థానాల్లో 12 గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు చోట్ల హునసూరు, శివాజీనగర్‌లలో మాత్రమే గెలిచింది. మిగిలిన ఒక సీటు స్వతంత్ర అభ్యర్థి శరత్ బచెగౌడకు దక్కింది. ఇకపోతే …ఈ ఉప ఎన్నికల్లో 12 స్థానాలకు పోటీ చేసిన జనతాదళ్ (ఎస్) ఒక సీటు కూడా సంపాదించుకోలేదు. 2018 నాటి ఎన్నికల్లో జెడి (ఎస్) కెఆర్ పేట్, మహలక్ష్మీ లే అవుట్, హున్సూర్ లలో విజయం సాధించింది.
గెలిచిన బిజెపి అభ్యర్థులు
అరబలి శివరాం హెబ్బార్ (యెల్లాపుర), నారాయణగౌడ (కెఆర్ పేట), బిసి పాటిల్ (హిరేకెరూర్), శ్రీమంత్ పాటిల్ (కగ్వాడ్), మహేష్ కుంతల్లి (అథాని), కె. సుధాకర్ (చిక్కబళ్లాపూర్), కె. గోపాలయ్య ( మహలక్ష్మీ లే అవుట్), ఆనంద్‌సింగ్ (విజయనగర), రమేష్ జర్కిహోళి ( గోకక్), అరుణ్‌కుమార్ గుట్టూర్ (రాణెబెన్నూర్), ఎస్.టి. సోమశేఖర్ (యశ్వంత్‌పుర), బైరతి బసవరాజ్ (కెఆర్ పురం). కాంగ్రెస్ అభ్యర్థులు రిజ్వాన్ అర్షాద్ (శివాజీనగర్), హెచ్‌పి మంజునాథ్ (హునసూరు)లలో విజయం సాధించారు.
225 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఉప ఎన్నికలకు ముందు మెజారిటీ కోసం బిజెపికి ఆరు స్థానాలు అవసరమయ్యాయి. ఇప్పుడు మెజారిటీ లభించింది. కోర్టు కేసులు ఉండడం వల్ల మస్కీ, ఆర్ ఆర్ నగర్ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగలేదు.
2018 ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యుల్లో 17 మందికాంగ్రెస్, జెడిఎస్ రెబెల్ సభ్యులపై అనర్హత వేటు పడడంతో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. దాంతో ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. ఉప ఎన్నికలకు ముందు సభలో బిజెపికి 105 మంది ఎంఎల్‌ఎలు (ఒక స్వతంత్ర సభ్యుడితో కలిపి) ఉన్నారు. కాంగ్రెస్‌కు 66 మంది, జెడి ఎస్‌కు 34 మంది ఎంఎల్‌ఎలున్నారు.
అస్థిర ప్రభుత్వానికి అవకాశం లేదు: మోడీ
కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాల పై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. బలమైన, సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలు బలోపేతం చేశారని మోడీ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, జెడి (ఎస్) తమకు ద్రోహం చేయలేవని కర్ణాటక ప్రజలు నిరూపించారు. అస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వలేదు’ అని ప్రధాని మోడీ జార్ఖండ్ హజారీబాగ్‌లో సోమవారం జరిగిన ఒక ర్యాలీలో వ్యాఖ్యానించారు. ‘రాజకీయ సుస్థిరత గురించి దేశం ఆలోచిస్తోంది. అటువంటి రాజకీయ సుస్థిరతకోసం దేశం బిజెపిని విశ్వసిస్తోంది. అందుకు తార్కాణం నేడు మన ముందుంది. కర్ణాటక ప్రజలకు నా కృతజ్ఞతలు’ అని మోడీ పేర్కొన్నారు.
సుపరిపాలన అందిస్తా : యెడ్డీ
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై బిజెపిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాబోయే మూడున్నర సంవత్సరాలలో, తన పదవీకాలంలో సుస్థిరమైన, అభివృద్ధి బాటలో నడిచే ప్రభుత్వాన్ని అందిస్తానని ముఖ్యమంత్రి యెడియూరప్ప సోమవారం ఉద్ఘాటించారు. ‘ఓటర్లు తీర్పిచ్చారు. ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మేము రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి సారించాలి. మా మంత్రులు, ఎంఎల్‌ఎల తోడ్పాటుతో వచ్చే మూడున్నరేళ్లలో మంచి పరిపాలనను అందిస్తాను’ అని కర్ణాటక సిఎం విలేకరులతో అన్నారు. ఎలాంటి అవరోధాలూ లేకుండా తన పదవీ కాలాన్ని పూర్తి చేసేందుకు ఆయన ప్రతిపక్షాల సహకారాన్ని కోరారు. ‘ప్రజల్లో అయోమయం కల్పించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. కనీసం ఇప్పటి నుంచైనా మాకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అనర్హత వేటు పడిన (కాంగ్రెస్ జెడి ఎస్) ఎంఎల్‌ఎలకు మంత్రి పదవులు ఇస్తామని నేను మాటిచ్చాను. ఆ మాట నుంచి వెనక్కు వెళ్లే ప్రశ్నే లేదు. వారి నియోజకవర్గాల్లో మా పార్టీని పటిష్టం చేసే బాధ్యతను అప్పగిస్తాం’ అని కర్ణాటక సిఎం యెడియూరప్ప స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com