బిజెపి ఎంపిలు పార్లమెంటుకు గైర్హాజరవడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నేడు జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కారణంగా నేటి సమావేశానికి మోడీ హాజరు కాలేదు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించిన సాధ్వి ప్రగ్యా ఠాకూర్ సింగ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. రాజ్‌నాథ్ సింగ్ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంటులో సిటిజెన్‌షిప్ (అమెండ్‌మెంట్) బిల్ ప్రవేశపెట్టే సమయంలో సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశించారు. ఆర్టికల్ 370 రద్దు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో, ఈ బిల్లు కూడా అంతే ప్రాముఖ్యతను కలిగి ఉందని రాజ్‌నాథ్ చెప్పారు.