ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డేవిడ్‌ వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ తో పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2019, 12:55 PM

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన వార్నర్‌..  పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో భారీ సెంచరీతో మెరిశాడు. అదే జోరును రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సైతం కొనసాగిస్తున్నాడు. నిన్నటి తొలి రోజు ఆటలో సెంచరీ మార్కును చేరిన వార్నర్‌.. ఈ రోజు ఆటలో దాన్ని ట్రిపుల్‌ సెంచరీగా మలచుకున్నాడు. 394 బంతుల్లో 37 ఫోర్లతో వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్‌కు టెస్టుల్లో ఇదే తొలి ట్రిపుల్‌ సెంచరీ కాగా, ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ నిలిచాడు. ఇక పాకిస్తాన్‌పై ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆసీస్‌ ఆటగాడిగా గుర్తింపు సాధించిన వార్నర్‌.. ఓపెనర్‌గా నాల్గో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా చూస్తే టెస్టు ఫార్మాట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన 16వ ఆటగాడు వార్నర్‌. కాగా, డే అండ్‌ నైట్‌ టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన నయా రికార్డును వార్నర్‌ తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు వరకూ పాకిస్తాన్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ(302 నాటౌట్‌) పేరిట ఈ రికార్డు ఉండగా దాన్ని వార్నర్‌ బ్రేక్‌ చేశాడు.వార్నర్‌ 303 పరుగులకు చేరిన తర్వాత అజహర్‌ అలీ రికార్డు బ్రేక్‌ అయ్యింది. 302/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా లబూషేన్‌(162) వికెట్‌ను కోల్పోయింది. లబూషేన్‌ భారీ సెంచరీ చేసిన తర్వాత రెండో వికెట్‌గా కోల్పోయాడు.  కాగా, డేవిడ్‌ వార్నర్‌ మాత్రం తొలి రోజు దూకుడునే కొనసాగించాడు. తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌.. రెండో రోజు ఆటలో డబుల్‌ సెంచరీ మార్కును చేరాడు. 166 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన వార్నర్‌ సమయోచితంగా ఆడి ద్విశతకం నమోదు చేశాడు. ఆపై ట్రిపుల్‌ సెంచరీని సాధించాడు. స్టీవ్‌ స్మిత్‌(36) మూడో వికెట్‌గా ఔటైనప్పటికీ వార్నర్‌ మాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. డబుల్‌ సెంచరీని ట్రిపుల్‌గా మార్చుకుని ఆసీస్‌కు భారీ స్కోరును సాధించిపెట్టాడు. లబూషేన్‌తో కలిసి వార్నర్‌ 361 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ 126 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 569 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com