శుక్రవారం రాత్రి 7.30 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి. . అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి.